ఊరుకాని ఊరిలో వెట్టిచాకిరీ
బుట్టాయగూడెం :
పొట్టకూటి కోసం ఊరుకాని ఊరు వెళ్లిన ఆ గిరిజనులను అక్కడి యజమానులు నిర్బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీనిని భరించలేని ఇద్దరు పారిపోయి సొంతూరు చేరారు. అక్కడ తాము పడిన అవస్థలను స్థానికులకు వివరించారు. దీంతో అక్కడే ఉండిపోయిన 8 మందికి చెందిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరానికి చెందిన పదిమంది గిరిజనులు గుండి సత్యనారాయణ, కుర్సా కన్నయ్య, పూనెం లక్ష్మణరావు, కె.వెంకటేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, కె.సంకురుడు, కె.బోడయ్య, శివుడు భీమయ్య, కేతా శ్రీను, పరిమిరాజు చేపలు పట్టే పని కోసం కర్నూలు జిల్లా తిప్పయ్యపాలెం గ్రామానికి వెళ్లారు. వీరిని జిల్లాలోని కొవ్వూరుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి నెలకు రూ.6,500 చొప్పున జీతం ఇస్తామని చెప్పి తీసుకెళ్లాడు. పనికి వెళ్లే ముందు కొవ్వూరులో బిర్యానీతో పాటు మద్యం పోయించాడు. అక్కడికివెళ్లిన తర్వాత స్నానానికి సబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత టీవీలు ఉన్న గదుల్లో వసతి చూపించారు. దీంతో తమ దశ తిరిగిపోయిందని గిరిజనులు సంబరపడ్డారు. తీరా పనికి తీసుకెళ్లి వెట్టిచాకిరీ చేయించడం మొదలెట్టారు. రాత్రీపగలూ తేడా లేకుండా పనులు చేయించారు. కనీసం తిండి కూడా పెట్టడం లేదు. ఎవరూ పారిపోకుండా గస్తీ కోసం సిబ్బందిని నియమించారు. తిండిపెట్టడం లేదని ప్రశ్నిస్తే దారుణంగా కొడుతున్నారు. ఈ చిత్రహింసలు భరించలేని కేతా శ్రీను, పరిమి రాజు గస్తీకాసే వ్యక్తి కళ్లుగప్పి బయటపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల్లో డబ్బులు అడిగి సొంతూరు చేరారు.
పనిప్రదేశంలో ఈ గ్రామానికి చెందిన వారితోపాటు పడమర రేగులకుంట, జీలుగుమిల్లి, కుక్కునూరు, కూనవరం, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన అమాయక గిరిజనులు కూడా ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తమతోపాటు పనికోసం వచ్చిన జి.వెంకటేశ్వరరావు కొవ్వూరు నుంచే కనబడలేదని, వేరే కంపార్ట్‌మెంట్‌లో ఎక్కాడని భావించామని తెలిపారు. దీనిపై అధికారులు విచారణ జరిపి నిర్బంధంలో ఉన్న తమ వారిని విడిపించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. పనికి వెళ్లి చిక్కుకుపోయిన కుటుంబాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.