పాడేరు: ఏజెన్సీలో అభివద్ధి పనులు, గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పుస్తకాలను రూపొందించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో లోతేటి శివ శంకర్ స్పష్టం చేశారు. బుధవారం ఐటీడీఏ నూతన సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పనుల ప్రగతిపై ఆరాతీశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 8న స్వచ్ఛ భారత్ నిర్వహించాలని సూచించారు. 244 గ్రామ పంచాయతీలు, 11 మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. గిరిజన సంక్షేమానికి ఎనలేని సేవలందించిన ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ పేరు మీద గిరిజన విద్యార్ధులకు క్విజ్, వ్యాసచన పోటీలను నిర్వహించాలన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంనాడు అటవీ హక్కుల వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్నంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను మన్యానికి ఆహ్వానించి, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో గడిపేలా ఆయా యాజమాన్యాలతో చర్చించాలన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 192 విద్యా సంస్థలు నడుస్తున్నాయని, వాటిలో ప్రవేశాలకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల వివరించారు. 590 మంది సీఆర్టీలను నియమించామని చెప్పారు. గిరిజన సంక్షేమాశాఖ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ విద్యా సంస్థలకు నాబార్డ్, ఎస్‌డీపీ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ ఈఈ కుమార్ తెలిపారు. వనబంధు కల్యాణ యోజన పథకంలో జి.మాడుగుల మండలంలోని విద్యా సంస్థలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ట్రైకార్ , సీసీడీపీ పథకాల అమలు గురించి ఏపీవో కుమార్ వివరించారు. వ్యవసాయం, పశు సంవర్థకశాఖ, పట్టు పరిశ్రమ, పంచాయతీరాజ్, గహ నిర్మాణశాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఉపాధిహామీ, ఆర్‌అండ్‌బీ, వాటర్‌షెడ్ పథకం, వెలుగు పథకం ద్వారా అమలుతున్న పథకాలను అధికారులు ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారికి వివరించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీడీ రత్నాకర్, ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావు, సెరికల్చర్ ఏడీ రామేశ్వరరావు, పీఏవో శంకర్ రెడ్డి, కాఫీ ఏడీ రాధాకష్ణ పాల్గొన్నారు.