
బాలుడి దారుణ హత్య
♦ రేగోడ్ మండలం దేవునూర్‌లో ఘటన
♦ చంపి బావిలో పడేసిన దుండగులు
రేగోడ్ : సెలవుల్లో సరదాగా గడుపుదామని తల్లితో కలిసి సొంతూరుకు వచ్చిన తొమ్మిదేళ్ల బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవార సాయంత్రం రేగోడ్ మండలం దేవునూర్ గ్రామంలో కలకలకం రేపింది. స్థానిక ఏఎస్‌ఐ నారాయణ కథనం ప్రకారం.. దేవునూర్ గ్రామానికి చెందిన తలారి కవిత శంకర్ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కిరణ్‌కుమార్ . గ్రామంలో వీరికి రెండెకరాల భూమి ఉంది. ఐదేళ్ల క్రితం కవిత భర్త శంకర్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కవిత గత కొన్ని సంవత్సరాలుగా జగద్గిరిగుట్టలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉంటూ బాలనగర్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తోంది.
కుమారుడు కిరణ్‌కుమార్‌ను తన దగ్గరే ఉంచుకొని మూడోతరగతి చదివిస్తోంది. సెలవులు ఉండటంతో ఐదురోజుల క్రితం కొడుకును తీసుకుని గ్రామానికి వచ్చింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లో టీ తాగిన అనంతరం కిరణ్ బయటికి వెల్లాడు. ఆ తరువాత ఇంటికి రాలేదు. తల్లి కవిత కుమారుడి కోసం గ్రామమంతా వెతికింది. దీంతో అల్లాదుర్గం మండలంలోని గట్టుపల్లిలోని తన ఆడబిడ్డ ఇంటికి వెళ్లి కిరణ్ ఆచూకీ కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమెకు దేవునూర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. నీ బిడ్డ చనిపోయాడంటూ సమాచారం అందింది. దీంతో కవిత భోరున విలపిస్తూ గ్రామానికి చేరుకుంది.
గ్రామ శివారులోని పాడుబడిన బావిలో కిరణ్ కుమార్ (9) శవమై కనిపించాడు. కిరణ్ ముఖం మీద గాయాలు, రక్తం మరకలు ఉన్నాయి. బాలుడిని ఎవరో చంపేశారని తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిరణ్ మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కలిచివేసింది. ఖేడ్ సీఐ సైదానాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని కిరణ్ మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుడు కిరణ్ తల్లి కవిత ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ నారాయణ పేర్కొన్నారు.