ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న బంధువులు, స్థానికులు
- జ్వరంతో చేరిక.. తెల్లవారు జామున పెరిగిన వేడి
- వైద్యం వికటించిందని కుటుంబీకులు, బంధువుల వాదన
నారాయణఖేడ్: వైద్యం వికటించి బాలుడు మరణించాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు, స్థానికులు పట్ణంలోని శ్రీ పద్మావతి ఆస్పత్రి ముందు గురువారం ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల కథనం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన సంగయ్య, సుజాత దంపతులకు ఓ కూతురు, ఇద్దరు కుమారులు. కాగా చిన్న కుమారుడు విష్ణు(5) జ్వరంతో బాధపడుతుండడంతో నారాయణఖేడ్‌లోని శ్రీ పద్మావతి ఆస్పత్రికి బుధవారం రాత్రి తీసుకు వచ్చారు.
ఆస్పత్రిలో చేర్పించామని, జ్వరం అంతకంతకూ పెరిగిందని వారు తెలిపారు. రాత్రి పొద్దుపోయాక జ్వరం తీవ్రమైందని, ఆస్పత్రిలో సరైన వైద్యం అందలేదని ఆరోపించారు. దీంతో బాలుడు తెల్లవారు జామున మరణించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో సరైన చికిత్స అందకపోవడం, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మరణించాడని వారు ఆరోపించారు. ఉదయం పెద్దశంకరంపేట వాసులు, బంధువులు, స్థానికులు ఆస్పత్రి ముందు గుమిగూడి ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది.
విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు తన సిబ్బందితో వచ్చి ఆస్పత్రి వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. దీనికి సంబంధించి ఆయన వైద్యుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆందోళన విషయంపై శ్రీ పద్మావతి ఆస్పత్రి వైద్యుడు డా.టి.వినయ్‌కుమార్ వద్ద విలేకర్లు ప్రస్తావించగా బాలుణ్ణి రాత్రి 8.30 గంటలకు ఆస్పత్రికి తీసుకు వచ్చారని, చికిత్స అందించడంతో 10.30వరకు జ్వరం తీవ్రత తగ్గిందని అన్నారు. 102.7 టెంపరేచర్ ఉండగా తగ్గిందని, వెళ్ళిపోవాల్సిందిగా సూచించామని అన్నారు. వారు ఆస్పత్రిలోనే ఉన్నారని, తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో తమ సిబ్బంది వచ్చి బాలుడికి జ్వరం తీవ్రమైందని చెప్పడంతో పరీక్షించామన్నారు. అప్పుడు 104 టెంపరేచర్ ఉందని తెలిపారు. తాము ఇతర ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించినట్లు వైద్యుడు తెలిపారు. రక్త నమూనాలు సేకరించామని, టైఫాయిడ్, మలేరియా లేదని, బాలుడికి మరేదైనా సమస్య ఉండి ఉండవచ్చని తెలిపారు.