వివరాలు తెలుపుతున్న సీఐ వెంకటేశ్వర్‌రావు
కంగ్టి(నారాయణఖేడ్): ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా గూగుల్ పే యాప్ ద్వారా డబ్బులు కాజేసిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 2.4 లక్షలు రికవరీ చేశారు. ఈ సంఘటనలో నిందితుడిని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగుర్(కే) గ్రామంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కంగ్టి సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నాగుర్(కే) గ్రామానికి చెందిన నడిమిదొడ్డి శాంతమ్మకు కంగ్టిలోని ఏపీజీవీబీలో సేవింగ్ ఖాతా ఉంది. తొమ్మిది నెలల క్రితం ఆమె భర్త బాబు మృతి చెందడంతో రైతు బీమా డబ్బులు రూ.5 లక్షలు, కూతురు వివాహం జరగడంతో కల్యాణలక్ష్మి డబ్బులు రూ. 75 వేలు ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ ఖాతాల్లో సొమ్ము వచ్చేలా చూడాలని గ్రామంలో పైరవీలు చేసే వాగ్‌మారే తుకారాంకు బాధిత మహిళ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చింది. ఈ క్రమంలో తుకారాం మహిళను నమ్మించి మాయ మాట లు చెప్పి ఏటీఎం కార్డు సైతం తస్కరించాడు. శాంతమ్మ ఖాతాలో ఉన్న డబ్బులు కాజేయాల ని పథకం వేశాడు.
అంతలోనే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి సెల్‌ఫోన్ పోగొట్టుకున్నాడు. అది తుకారాంకు దొరికింది. రాజు తన సిమ్ కార్డును రిచార్జీ చేసి దాన్ని వేరే ఫోన్‌లో యాక్టివేట్ చేయించుకొన్నాడు. తనకు దొరికిన ఫోన్‌లోని నంబర్‌ను శాంతమ్మ బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకొనేందుకు మరో మహిళను తీసుకువెళ్లాడు. బ్యాంకులో మరో మహిళ ను పరిచయం చేసి ఆమె శాంతమ్మ అని ఫోన్ నంబర్ లింక్ చేయాలంటూ దరఖాస్తు చేయించాడు. దీంతో తుకారాం మార్గం సుగమం అయింది. తస్కరించిన ఏటీఎం కార్డును ఉపయోగించి తన మొబైల్‌లో గుగూల్‌పే యాప్‌లో డబ్బులను దశల వారీగా డ్రా చేయడం ప్రారంభించాడు. ఇలా రెండు నెలల వ్యవధిలో రూ. 2.5 లక్షలు డ్రా చేశాడు. గత నెల 29వ తేదిన శాంతమ్మ బ్యాంకుకు వెళ్లి ఆరా తీసి రూ. 2.5 లక్షలు డ్రా చేసినట్లు తేలడంతో గగ్గోలు పెట్టింది. ఏడుస్తూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వివరాలు తెలుసుకొన్న పోలీసులు గురువారం నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుంచి రూ. 2.4 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. నిందితున్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ అబ్దుల్ రఫీక్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ నారాయణ, సిబ్బంది ప్రేమ్‌సింగ్, తుకారం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment