గుమ్మఘట్ట మండలం తాళ్లకెరకు చెందిన బోయ ఈరక్క, హనుమంతప్ప దంపతుల కుమారుడు సందీష్(9) కర్ణాటక రాష్ట్రం జగళూరు సమీపంలోని కానకట్ట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు మృతుని బంధువులు తెలిపారు.
గుమ్మఘట్ట : గుమ్మఘట్ట మండలం తాళ్లకెరకు చెందిన బోయ ఈరక్క, హనుమంతప్ప దంపతుల కుమారుడు సందీష్(9) కర్ణాటక రాష్ట్రం జగళూరు సమీపంలోని కానకట్ట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు మృతుని బంధువులు తెలిపారు. సమీప బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి తల్లిదండ్రులతో కలసి వెళ్లిన సందీప్ ట్రాక్టర్‌లో డ్రమ్ములు, బిందెలు తీసుకుని తాగునీటి కోసం వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడటంతో అతను ట్రాలీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడన్నారు. మరో చిన్నారి ఎగిరి అల్లంత దూరంలో పడిపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు.
సందీప్ స్వగ్రామంలోని పాఠశాలలో ఐదో తరగతి చదివేవాడు. ‘స్కూల్ ఉంది.. రానన్నా పిల్చుకొచ్చి నిన్ను దూరం చేసుకుంటిమి కద బిడ్డా’ అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదం విషయం తెలియగానే ప్రధానోపాధ్యాయురాలు సుమ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బెస్త రామాంజినేయులు ఆధ్వర్యంలో ఐదు నిమిషాల పాటు మౌనం పాటించి పాఠశాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.