ప్రాణం తీసిన ఈత సరదా
Published Tue, Nov 22 2016 1:31 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
దురాజ్‌పల్లి(చివ్వెంల) : ఈత సరదా బాలుడి ప్రాణాన్ని బలిగొంది. దైవ దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన బాలుడు కోనేరులో పడి మృతిచెందగా, అతడి బావ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈవిషాద సంఘటన మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) ఆలయ ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కుసుమంచి మం డలం గంగబండ తండాకు చెందిన వట్యా నాగేశ్వర్‌రావు తన కూతురు పుట్టు వెంట్రుకలు తీసేందుకు శ్రీలింగమంతుల ఆలయానికి సోమవారం బంధువులతో కలిసి వచ్చాడు.
ఈక్రమంలో ఆలయ ప్రదక్షిణ కోసం వెళ్లే క్రమంలో స్నానం చేసేందుకు బంధువులు అందరూ కలిసి కోనేరులోకి వెళ్లారు. కాగా కోనేరులో 10 అడుగుల లోతులో నీరు ఉన్నాయి. ఈక్రమంలో అందరూ మెట్ల వద్ద కూర్చొని స్నానం చేస్తుండగా వారితో పాటు వచ్చిన బానోతు విజయ్(12) ఈత కొడదామనే సరదాతో లోపలికి వెళ్లాడు. కాగా ఈత రాకపోవడంతో ఒక్కసారిగా కేకలు వేశాడు. గమనించిన మృతుడి బావ నాగేశ్వరావు బాలుడు రక్షించాలనే నేపథ్యంలో లోపలికి వెళ్లాడు. కాగా నాగేశ్వర్‌రావుకు ఈత రాకపోవడంతో బాలుడు అతనిని రక్షించాలని కేకలు వేస్తూ లోపలికి లాగాడు.
ఊపిరి ఆడక ఇద్దరు కోనేరులో కొట్టుకుంటుండగా బంధువులలో ఒకరైన నిర్మల తన చున్నిని లోపలికి వేసి నాగేశ్వర్‌రావును బయటకు లాగింది. కాని అప్పటికే విజయ్ మృత్యువాత పడ్డాడు. కోనేరు వద్దకు వెళ్లిన ఎవ్వరికి ఈత రాకపోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు కూసుమంచి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Advertisement