ప్రియుడు కోసం ప్రియురాలి మౌన దీక్ష
రేగిడి : ప్రేమించిన ప్రియుడు సంబంధం లేదంటూ వదిలేయడంతో మోసపోయిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందే బుధవారం మౌనదీక్షకు దిగింది. మండలంలో చిన్నపుర్లి గ్రామానికి చెందిన గ్రామస్తులతో పాటు బాధితురాలు అందించిన వివరాలు... గ్రామానికి చెందిన కొబగాన సాయికుమారి తన తల్లిదండ్రులు అంజమ్మ, గౌరునాయుడుతో కలిసి విజయవాడలో నివాసం ఉంటుంది.
ఆరేళ్ల కిందట తన సోదరి వివాహ నిమిత్తం రేగిడి మండలంలోని స్వగ్రామమైన చిన్నపుర్లి వచ్చింది. ఇక్కడ నెల రోజులున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఎర్నేన చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. చదువుకున్న వాడు కావడంతో పాటు వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె ప్రేమలో పడింది. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో పాటు చంద్రశేఖర్ కూడా పలుమార్లు విజయవాడ వెళ్లివస్తుండేవాడు. ఈ తరుణంలో వీరి మధ్య సంబంధం మరింత పెరిగింది.
అయితే గత ఏడాది నవంబరు నుంచి చంద్రశేఖర్ బాధితురాలికి ఫోన్ చేయకపోవడంతో పాటు వివాహం చేసుకోనని చెప్పేశాడు. దీంతో మోసపోయిన బాధితురాలు అప్పట్లోనే రేగిడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనకు న్యాయం జరగలేదని దీంతో గత్యంతరం లేకే తన ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్షకు దిగినట్టు పేర్కొంది. తన ప్రియుడు గ్రామంలోనే ఉన్నాడని, న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపింది. చంద్రశేఖర్ విశాఖపట్నంలోని ఓ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తున్నట్టు పేర్కొంది. విషయం తెలుసుకున్న రేగిడి స్టేషన్ ట్రైనీ ఎస్‌ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.