అశోక్ మృతదేహం
- ప్రియుడు ఆత్మహత్య
టేకులపల్లి : ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతుందనే మనస్థాపంతో ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్‌ఐ ఎంఏ అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సులానగర్ పంచాయతీ జండాలతండాకు చెందిన బానోతు అశోక్ (23), అదే గ్రామానికి చెందిన దారావత్ అనిత (ఇంటర్ విద్యార్థిని) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 19న బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కొత్తగూడెంలో చికిత్స పొందుతోంది. అయితే బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన అశోక్ ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కటుంబ సభ్యులు ఆటోలో కొత్తగూడెంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.