
వాట్సప్‌లో ప్రేమాయణం
► పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
► యువతి ఆత్మహత్యాయత్నం
► పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా మారని తీరు
ఉండవల్లి (తాడేపల్లి రూరల్): వాట్సప్‌లో మొదలైన ప్రేమాయణం విఫలమవడంతో యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తాడేపల్లి మండలం ఉండవల్లిలో కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఓ వ్యక్తి పది సంవత్సరాల క్రితం వలస వచ్చి ఉండవల్లి సెంటర్‌లో నివాసం ఉంటూ విగ్గులు తయారుచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించాడు. కుమార్తె బీటెక్‌లో మంచి ఫలితాలు సాధించడంతో తండ్రి ముచ్చటపడి సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అదే ఆమె పాలిట శాపమయ్యింది. ఆండ్రాయిడ్ ఫోన్ కావడంతో ఫేస్‌బుక్, వాట్సప్‌లను ఆమె వినియోగించింది. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన గోపాలకృష్ణ వాట్సప్‌లో ఆమెకు పరిచయమయ్యాడు. వాట్సప్‌లోనే ప్రేమాయణం కొనసాగించి, ఈ నెల 7వ తేదీన తిరుపతి వెళ్లి గోపాలకృష్ణను కలిసింది. అతని తల్లిదండ్రులకు కూడా ప్రేమ విషయాన్ని తెలియచేసింది. దీంతో గోపాలకృష్ణ, అతని కుటుంబసభ్యులు తిరస్కరించారు.
ఆమె తిరుపతిలోనే ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడి పోలీసులు రెండు రోజుల పాటు లేడీస్‌హాస్టల్‌లో ఉంచి ఆమె తండ్రికి సమాచారం ఇవ్వడంతో తిరుపతి వెళ్లి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చాడు. అతన్నే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టిన ఆమెను తల్లిదండ్రులు మందలించడంతో బుధవారం ఉండవల్లి సెంటర్ నుంచి పంటపొలాల్లోకి పారిపోయింది. పంటపొలాల్లో యువతి ఒంటరిగా కనిపించడంతో రైతులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మంగళగిరి రూరల్ సీఐ సురేష్ ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా జరిగిన విషయం తెలియజేసింది. పోలీసులు యువతికి కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పు రాలేదు. ఇంటికి వెళ్ళనని మారాం చేయడంతో పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కూతురికి సెల్‌ఫోన్ కొనిచ్చి పొరపాటు చేశానని ఆమె తండ్రి వాపోతున్నారు.