ఆలయ ధర్మకర్తలపై బ్రాహ్మణుల ఆగ్రహం
Published Mon, Aug 22 2016 12:13 AM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM
కొడంగల్ : పేదల తిరుపతిగా పేరుగాంచిన స్థానిక పద్మావతీ సమేత శ్రీ మహాక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలపై కొడంగల్ బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఆలయంలో ప్రతి ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, లక్ష తులసీ అర్చన, ఉగాది ఉత్సవాలు, ధనుర్మాసం పూజలు, నెలవారీ ప్రత్యేక పూజలు, ఇతర ముఖ్య పండుగలు, పర్వదినాల్లో నిర్వహించే పూజలు, కైంకర్యాలు అంగరంగా వైభవంగా నిర్వహించడంలో కొడంగల్ బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులు కీలకంగా ఉంటున్నారు. ఏనాడూ డబ్బులు ఆశించకుండా సేవా నిరతితో పూజల్లో పాల్గొంటున్నారు. అయితే ఆలయ ధర్మకర్తల నుంచి సరైన సహకారం, గౌరవం లేదని అవమాన పరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్తల విపరీత పోకడల వల్ల ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిందని ఆలయంలో నిత్యం కైంకర్యాల్లో ఎప్పుడూ చూసిన దేవుని మూలమూర్తికి అడ్డంగా ధర్మకర్తల కుటుంబసభ్యులు నిలబడతారని విమర్శించారు. భక్తులు ఆలయానికి రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారుడు సుందర వరద భట్టాచార్యులు ఆలయ ధర్మకర్తలను పిలిచి ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా చూడాలని మందలించినట్లు తెలిసింది.
Advertisement