కస్తూరిబాలో బదిలీలకు బ్రేక్!
కస్తూరిబాలో బదిలీలకు బ్రేక్!
Published Sat, Jun 17 2017 10:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
– ఎస్‌ఓ, సీఆర్‌టీల పాయింట్లలో అక్రమాలే కారణం
– రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో వెనక్కి తగ్గిన ఎస్‌ఎస్‌ఏ అధికారులు
– అప్పటికే బదిలీ స్థానాల్లో విధుల్లో చేరిన కొందరు సీఆర్‌టీలు, ఎస్‌ఓలు
– తిరిగి యథాస్థానాల్లో చేరేందుకు వస్తే అర్డర్ కావాలంటున్న ఎస్‌ఓలు
– మూడు నెలల తరువాత మళ్లీ బదిలీలు చేపట్టే అవకాశం?
కర్నూలు సిటీ: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్ల బదిలీలు రద్దు అయ్యాయి. బదిలీ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలుకావడంతో సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడునెలల తర్వాత మళ్లీ బదిలీలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
కస్తూరిబా స్కూళ్లలో పని చేస్తున్న ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్ల బదిలీలకు ఈ నెల 10వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ బదిలీలకు సంబంధించి రెండు రోజుల ముందు సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్‌కు రావాలని చెప్పారు. వచ్చిన వారికి వారి ప్రతిభ ఆధారిత, విద్యార్హత, తదితర వాటిలో వేసిన పాయింట్లలో భారీగా తేడాలు కనిపించడంతో కొంత మంది ఆందోళన చేపట్టారు. మరి కొందరు కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారుల దృష్టికి తీసుకుపోయి వాయిదా వేయాలని కోరారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని అధికారులు సమాధానం ఇవ్వడంతో ఎస్‌ఓ, సీఆర్‌టీలకు తోడు ఉపాధ్యాయ సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
దీంతో వారం రోజుల తరువాత బదిలీలు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అప్పటికే బదిలీలు అయిన కొందరు సీఆర్‌టీలు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విధుల్లో చేరారు. మరి కొంత మంది విధుల్లో చేరాల్సి ఉంది. బదిలీలను రద్దు చేసిన నేపథ్యంలో వారు తిరిగి యథాస్థానాల్లో చేరేందుకు ఆయా స్కూళ్ల దగ్గరకు వస్తే కొంత మంది ఎస్‌ఓలు అర్డర్ కాపీ కావాలని అడుగుతున్నట్లు తెలిసింది.
పాయింట్లలోని అక్రమాలే బదిలీల రద్దుకు కారణం
జిల్లాలోని 53 కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో 47 మంది ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లు సుమారు 401 మంది ఉన్నారు. వీరిలో ప్రత్యేకాధికారులు 3 సంవత్సరాలు, సీఆర్‌టీలు 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని ఉంటే వారికి తప్పనిసరిగా బదిలీలు చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ఎస్‌ఓలు 30 మంది, 226 మంది సీఆర్‌టీలను బదిలీ చేశారు. బదిలీలు చేసేందుకు పాయింట్లను ప్రమాణికంగా తీసుకున్నారు. అయితే ఈ పాయింట్ల నమోదులో జిల్లా అధికారులు పక్షపాతం చూపారని విమర్శలు ఉన్నాయి. కొంత మంది జూనియర్లకు సీనియర్ల కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. దీంతో పాటు సీఆర్‌టీలే ఇన్‌చార్జ్ ఎస్‌ఓలుగా ఉన్న 6 స్కూళలోనే పాయింట్లలో అక్రమాలు జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. పాయింట్లను స్టేట్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం నుంచే వేశారని జిల్లా అధికారులు చెబుతున్నా వాస్తవం అది కాదని కొందరు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఓల ద్వారా ప్రతిభ ఆధారిత, ప్రవర్తన, తదితర అంశాలపై వివరాలు సేకరించి పాంయింట్లు వేసినట్లు సమాచారం.
మూడు నెలల తరువాత బదిలీలు చేసే అవకాశం?
ప్రత్యేకాధిరులు, సీఆర్‌టీల బదిలీలను తాత్కాలికంగా రద్దు చేసినా మూడు నెలల తరువాత మళ్లీ చేపడతారని సమాచారం. అప్పుడు పక్కగా ప్రతిభ ఆధారిత పాయింట్లు, తదితర వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
Advertisement