Kasturiba schools
-
ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..
హిందూపురం/లేపాక్షి: కేంద్ర ఆహార భద్రత చట్టం–13 అమలు బాధ్యత అధికారులదేనని ఆహార భద్రత కమిషన్ సభ్యురాలు కృష్ణమ్మ స్పష్టం చేశారు. స్థానిక లక్ష్మీపురంలోని వైఎస్సార్ ఆరోగ్యకేంద్రం, సింగిరెడ్డిపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, సీపీఐ కాలనీలోని కస్తూరిబా విద్యాలయ, ఎంఎల్ఎస్ పాయింట్, చౌకధాన్య డిపోలను గురువారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రూ.వేల కోట్ల వ్యయంతో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాయన్నారు. ఆహార భద్రత కింద అమలులో ఉన్న వివిధ పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఇందులో నాన్ ఎఫ్ఏసీ కింద సుమారు 56లక్షల కార్డుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ రేషన్‌కార్డు అందజేస్తామన్నారు. ఎక్కడైనా అర్హులైన కార్డు రాకపోయినా, రేషన్ బియ్యంలో పంపిణీలో అవకతవకలు, నాణ్యత ప్రమాణాలు లోపించినా వెంటనే ఫుడ్‌కమిషన్ టోల్‌ఫ్రీ నంబర్ (155235)కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపించినా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ప్రధానమంత్రి మాతృయోజన పథకం కింద మొదటి, రెండవ కాన్పులకు అందిస్తున్న పారితోషికానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్‌ను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని గురువారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీ«కృష్ణారెడ్డి, డీఎం అశ్వత్థనారాయణ, ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి, నోడల్ ఆఫీసర్ గాయత్రి, సీడీపీఓ నాగమల్లేశ్వరి, డాక్టర్ ఆనంద్, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఈఓ రంగస్వామి, ఏడీ నాగరాజు, ఈడీ దివాకర్‌రెడ్డి, ఎంఈఓ గంగప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: కులాంతర వివాహంతోనే హత్య) -
కస్తూరిబాలో బదిలీలకు బ్రేక్!
– ఎస్ఓ, సీఆర్టీల పాయింట్లలో అక్రమాలే కారణం – రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో వెనక్కి తగ్గిన ఎస్ఎస్ఏ అధికారులు – అప్పటికే బదిలీ స్థానాల్లో విధుల్లో చేరిన కొందరు సీఆర్టీలు, ఎస్ఓలు – తిరిగి యథాస్థానాల్లో చేరేందుకు వస్తే అర్డర్ కావాలంటున్న ఎస్ఓలు – మూడు నెలల తరువాత మళ్లీ బదిలీలు చేపట్టే అవకాశం? కర్నూలు సిటీ: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్ల బదిలీలు రద్దు అయ్యాయి. బదిలీ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలుకావడంతో సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడునెలల తర్వాత మళ్లీ బదిలీలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కస్తూరిబా స్కూళ్లలో పని చేస్తున్న ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్ల బదిలీలకు ఈ నెల 10వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ బదిలీలకు సంబంధించి రెండు రోజుల ముందు సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్‌కు రావాలని చెప్పారు. వచ్చిన వారికి వారి ప్రతిభ ఆధారిత, విద్యార్హత, తదితర వాటిలో వేసిన పాయింట్లలో భారీగా తేడాలు కనిపించడంతో కొంత మంది ఆందోళన చేపట్టారు. మరి కొందరు కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారుల దృష్టికి తీసుకుపోయి వాయిదా వేయాలని కోరారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని అధికారులు సమాధానం ఇవ్వడంతో ఎస్ఓ, సీఆర్టీలకు తోడు ఉపాధ్యాయ సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దీంతో వారం రోజుల తరువాత బదిలీలు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అప్పటికే బదిలీలు అయిన కొందరు సీఆర్టీలు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విధుల్లో చేరారు. మరి కొంత మంది విధుల్లో చేరాల్సి ఉంది. బదిలీలను రద్దు చేసిన నేపథ్యంలో వారు తిరిగి యథాస్థానాల్లో చేరేందుకు ఆయా స్కూళ్ల దగ్గరకు వస్తే కొంత మంది ఎస్ఓలు అర్డర్ కాపీ కావాలని అడుగుతున్నట్లు తెలిసింది. పాయింట్లలోని అక్రమాలే బదిలీల రద్దుకు కారణం జిల్లాలోని 53 కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో 47 మంది ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లు సుమారు 401 మంది ఉన్నారు. వీరిలో ప్రత్యేకాధికారులు 3 సంవత్సరాలు, సీఆర్టీలు 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని ఉంటే వారికి తప్పనిసరిగా బదిలీలు చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ఎస్ఓలు 30 మంది, 226 మంది సీఆర్టీలను బదిలీ చేశారు. బదిలీలు చేసేందుకు పాయింట్లను ప్రమాణికంగా తీసుకున్నారు. అయితే ఈ పాయింట్ల నమోదులో జిల్లా అధికారులు పక్షపాతం చూపారని విమర్శలు ఉన్నాయి. కొంత మంది జూనియర్లకు సీనియర్ల కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. దీంతో పాటు సీఆర్టీలే ఇన్చార్జ్ ఎస్‌ఓలుగా ఉన్న 6 స్కూళలోనే పాయింట్లలో అక్రమాలు జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. పాయింట్లను స్టేట్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం నుంచే వేశారని జిల్లా అధికారులు చెబుతున్నా వాస్తవం అది కాదని కొందరు ఆరోపిస్తున్నారు. ఎస్ఓల ద్వారా ప్రతిభ ఆధారిత, ప్రవర్తన, తదితర అంశాలపై వివరాలు సేకరించి పాంయింట్లు వేసినట్లు సమాచారం. మూడు నెలల తరువాత బదిలీలు చేసే అవకాశం? ప్రత్యేకాధిరులు, సీఆర్టీల బదిలీలను తాత్కాలికంగా రద్దు చేసినా మూడు నెలల తరువాత మళ్లీ చేపడతారని సమాచారం. అప్పుడు పక్కగా ప్రతిభ ఆధారిత పాయింట్లు, తదితర వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. -
కంప్యూటర్లు వృథా
మోర్తాడ్, న్యూస్‌లైన్ : కస్తూర్బా పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి గతంలో నియమించిన ఇన్స్ట్రక్టర్లను జిల్లా అధికార యంత్రాంగం తొలగించింది. బడి మానివేసిన విద్యార్థినులు, బాల కార్మికులుగా మారిన ఆడపిల్లలకు మళ్లీ మంచి చదువును అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక కస్తూర్బా పాఠశాలను ప్రారంభించింది. రెగ్యులర్ విద్యార్థుల మాది రిగానే కస్తూర్బా విద్యార్థినులకు వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. చదువుతో పాటు కుట్లు, అల్లికలు, టైలరింగ్, కంప్యూటర్ రంగాలలో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడానికి ఇన్స్ట్రక్టర్లను నియమిం చారు. ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ 4500 వేతనాన్ని రాజీవ్ విద్యా మిషన్ అధికారులు చెల్లించేవారు. కస్తూర్బా పాఠశాలల్లో ఆరవతరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేవారు. విద్యార్థులకు కం ప్యూటర్ పరిజ్ఞానంలో ఒక రోజు థియరీ క్లాసులు, మరో రోజు ప్రాక్టికల్స్‌ను నిర్వహించేవారు. కస్తూ ర్బా పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసినా ఇన్‌స్ట్రక్టర్ల నియామకం ఎక్కడా జరగలేదు. గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన క్రిస్టీనా ప్రత్యేక చొరవ చూపి కంప్యూటర్ శిక్షణకు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్టర్లను నియమించడానికి చర్యలు తీసుకున్నారు. రాజీవ్ విద్యా మిషన్ పథకానికి కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ల వేతనం భారం అవుతుం దని గమనించిన ప్రస్తుత అధికార యంత్రాంగం కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను తొలగించాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల ఆరంభం నుంచి ఇన్స్ట్రక్టర్లు పాఠశాలలకు రావడం మాని వేశారు. కస్తూర్బా పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులను బోధిస్తు న్న ఉపాధ్యాయులే కంప్యూటర్ శిక్షణను విద్యార్థులకు అందించాలని అధికారులు ఆదేశించారు. కా గా ఉపాధ్యాయులలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు లేక పోవడంతో ల్యాబ్‌లను మూసి ఉం చుతున్నారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం వల్ల విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందగా, అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. ఇప్పుడు అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల ఇన్స్ట్రక్టర్లు వీధిన పడగా, విద్యార్థులకు శిక్షణ అందకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంప్యూటర్ శిక్షకుల పునర్నియామకం పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. ఉపాధ్యాయులతోనే శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం - రుక్మయ్య స్పెషల్ ఆఫీసర్, కస్తూర్బా పాఠశాల మోర్తాడ్ కంప్యూటర్ ఇన్స్ట్రకర్లను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉన్న ఉపాధ్యాయులతోనే శిక్షణ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు విద్యార్థులు నేర్చుకున్న విషయాన్ని కంప్యూటర్ ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్స్ట్రక్టర్లు ఉంటే బాగుండేది.