శాకాంబరీ నమో నమః
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలోని అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీభ్రమరాంబాదేవిని మంగళవారం శాకాంబరిగా అలంకరించి ప్రత్యేకపూజలను చేశారు. ఆషాఢమాస పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబాదేవి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో అలంకరించారు. సంప్రదాయానుసారం అమ్మవారికి ప్రత్యేక అర్చనలను అర్చకులు, వేదపండితులు ఏకాంతంలో నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రధాన ద్వారానికి కుడివైపు ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేయించి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అలంకరించారు. అనంతరం 10 గంటలకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు, తదితర ప్రత్యేకపూజలను జేఈఓ హరినాథ్‌రెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా చేశారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవీ, సప్తమాత్రుకలు, గ్రామదేవత అంకాళమ్మ, అమ్మవారి ఆలయప్రాంగణంలోని అష్టాదశ మహాశక్తి విగ్రహాలు, ధ్వజస్తంభాలు, అన్నదాన మందిరంలోని అన్నపూర్ణాదేవి వార్లను పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. అమ్మవారిని శాకలతో అర్చించడంతో అతివష్టి అనావష్టి తొలగి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి కరువు కాటకాలు నివారింపబడుతాయని పురాణాలు చెబుతున్నట్లు జేఈఓ వెల్లడించారు..