![పేట్రేగుతున్న ఆకతాయిలు](/styles/webp/s3/article_images/2017/09/4/51474133844_625x300.jpg.webp?itok=Gb2Eilfx)
పేట్రేగుతున్న ఆకతాయిలు
– ఒంటరిగా తిరగాలంటే భయ పడుతున్న అమ్మాయిలు
– మళ్లీ పెరుగుతున్న బ్యాచ్‌ల సంస్కృతి
– అర్ధరాత్రి వేళలో బైకుల్లో సంచారం
ప్రొద్దుటూరు క్రైం: చేతిలో బైక్.. జేబులో తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీ.. పక్కన ఖర్చు చేయడానికి మిత్రులు.. ఇక మందు, బిరియానిలతో జల్సాలు చేయడం. అంత వరకూ అయితే ఇతరులకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. కానీ మద్యం మత్తులో వారు చేస్తున్న చేష్టలు వారి తల్లిదండ్రులతోపాటు అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదీ పట్టణంలో కొందరు ఆకతాయిలు చేస్తున్న పని.
నడి రోడ్డులో తన్నుకోవడం, అమ్మాయి కోసం రెండు గ్రూపులు కొట్టుకోవడం లాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో అధికంగా పోలీస్‌స్టేషన్‌లకు వస్తున్నాయి. అయితే ఈ ఘటనల్లో విద్యార్థులుండటంతో వారి భవిష్యత్తు దృష్ట్యా పోలీసులు కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు.
వారాంతపు రోజుల్లో అధికం: గతంలో గ్యాంగ్‌స్టర్‌ల గొడవతో భయానక వాతావరణం ఉండేది. తరచూ జరిగిన గొడవల్లో సుమారు 50 మంది విద్యార్థులపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. కొందరు తల్లిదండ్రులైతే గొడవలకు భయపడి తమ పిల్లలను హైదరాబాద్, తిరుపతి లాంటి ప్రాంతాలకు పంపించారు. తర్వాత పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడంతో గొడవలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇటీవల కాలంలో మళ్లీ యువకులు కలకలం సృష్టిస్తున్నారు. తల్లిదండ్రులు రూ.వేలకు వేలు ప్యాకెట్ మనీ ఇవ్వడమే గాక వారికి బైక్ కూడా కొనివ్వడంతో కొందరు యువకులు కాలేజీలకు డుమ్మా కొట్టి అల్లర్లకు పాల్పడుతున్నారు. వారాంతపు రోజుల్లో వీరి ఆగడాలు మరీ ఎక్కువ కనిపిస్తుంటాయి. సాయంత్రం వేళలో రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతం, ఎర్రగుంట్ల రోడ్డులోని పార్కు, రైల్వేస్టేషన్ సమీపంలో సిట్టింగ్ వేసి మద్యం సేవిస్తుంటారు. మద్యం మత్తులో అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేయడం, వాహనాలకు నష్టం కలిగించడం లాంటి పనులు చేస్తున్నారు.
కొన్ని సంఘటనలు..
– రెండు నెలల క్రితం సాయిటీర్ కుటీర్ రోడ్డులో నలుగురు యువకులు మద్యం సేవించి అమ్మాయి విషయంలో ఘర్షణ పడ్డారు. ప్రధాన రహదారిలో ఈ సంఘటన జరగడంతో కొంత సేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది.
– కోనేటి కాల్వ వీధిలో, రామేశ్వరంరోడ్డులోని అనా బంకు సమీపంలో, ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని నాలుగు రోడ్ల సమీపంలో, గంగమ్మఆలయం వీధిలో, మార్కెట్ యార్డు ఆవరణలో వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన వారు మద్యం మత్తులో తన్నుకున్నారు. ఇందులో గంగమ్మ ఆలయం వీధిలో జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు.
– నెహ్రూ రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలిలో కొందరు గ్రూపులుగా ఏర్పడి ఆ ప్రాంతంలో వెళ్లే కళాశాల, పాఠశాల విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు అంటున్నారు.
– ఇటీవల కోనేటి కాలువ వీధి, భావనారుషి ఆలయం సమీపంలో, ప్రకాష్‌నగర్‌లో ఒకే రోజు మూడు బైక్‌లను కాల్చేశారు.
– భగత్‌సింగ్ కాలనీ సమీపంలో ఒక యువతిని వేధిస్తున్నాడనే కారణంతో ఆ ప్రాంత వాసులు జులాయికి దేహశుద్ధి చేశారు.
– పట్టణంలోని వూటుకూరు వీరయ్య పాఠశాలలో ఫ్యాన్లు, తలుపులు, కిటికీలను ధ్వంసం చేయడమేగాక మద్యం తాగి సీసాలను పగులగొట్టారు.
– త్రిబుల్ రైడింగ్‌తో విద్యార్థులు ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నప్పటికీ ఎందుకో మరి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. గాంధీరోడ్డు, నెహ్రూరోడ్డు, సూపర్‌బజార్‌రోడ్డులలో విద్యార్థినులను వేధిస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు అంటున్నారు. విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీం ద్వారా వారికి రక్షణ లభించడం లేదు. రాత్రి వేళల్లో పొద్దుపోయే వరకు యువకులు పార్టీల పేరుతో పట్టణంలో నిత్యం బైకుల్లో సంచరిస్తున్నారు. పోలీసులు తగినంత నిఘా పెట్టకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
– ఇవీ వెలుగులోకి వచ్చిన సంఘటనలు మాత్రమే. అనేకం బయటికి రావడం లేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని వీటిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
పట్టణంలో పోలీసు గస్తీ ముమ్మరం చేసి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కళాశాలల వద్ద కూడా షీ టీం సభ్యులతో నిఘా ఏర్పాటు చేస్తాం.
– పూజిత నీలం, ప్రొద్దుటూరు డీఎస్పీ