రుధిర తర్పణం
రుధిర తర్పణం
Published Wed, Oct 12 2016 9:31 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
మచిలీపట్నం : మొహర్రం సందర్భంగా ‘యా హుస్సేన్... యా ఆలీ..’ అనే నినాదాలతో స్థానిక కోనేరుసెంటరు బుధవారం మార్మోగింది. మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, ఆయన 72 మంది అనుచరుల త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు రక్తం చిందించారు. మచిలీపట్నంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు కోనేరుసెంటరుకు చేరుకుని ఇమాం హుస్సేన్, ఆయన అనుచరులు కర్భలా మైదానంలో ప్రాణత్యాగం చేసిన వైనాన్ని స్మరించుకున్నారు. తొలుత గిరియోహజరత్ హజ్జత్ (చిన్నపార్టీ) సభ్యులు చింతచెట్టు సెంటరులోని సాహెబ్ పంజా నుంచి రాజుపేట మీదుగా కోనేరుసెంటరు వరకు జుల్‌జనా (ర్యాలీ) నిర్వహించారు. కోనేరుసెంటరులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మస్జిదా ఇమానే గురువు జమానా పేషిమా నమాజ్ చేశారు. కర్బలా మైదానంలో ఇమామ్ హుస్సేన్, ఆయన 72 మంది అనుచరులు ధర్మయుద్ధం చేసిన తీరు, ప్రవక్తకు ఆయన అనుచరులకు మూడురోజులపాటు తాగునీరు ఇవ్వకుండా హింసించిన విధానాన్ని గురువు వివరించారు. చిన్న పార్టీ కోనేరుసెంటరును వీడిన అనంతరం ఇనగుదురుపేటలోని బారేమాం పంజా నుంచి గిరియోహజరత్‌హజ్జత్(పెద్ద పార్టీ) సభ్యులు ఇనుగుదురుపేట నుంచి ర్యాలీగా బయలుదేరి జవ్వారుపేట, బుట్టాయిపేట, వల్లూరిరాజా సెంటరు మీదుగా కోనేరుసెంటరు వరకు జుల్‌జనా నిర్వహించారు.
అలనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ...
పవిత్రయుద్ధంలో మరణించిన ఇమాం హుస్సేన్ మృతదేహం తీసుకొచ్చేందుకు ఆయన కుమార్తె బీసకీనా శవపేటికను అలంకరించి తీసుకువెళ్లడాన్ని గుర్తు చేస్తూ యువతులు, చిన్నారులు శవపేటికను మోసుకుంటూ కోనేరుసెంటరుకు వచ్చారు. ఇమాం హుస్సేన్ మరణానంతరం నాటి యుద్ధ వాతావరణం(జుల్‌జనా)ను గుర్తుకు తెస్తూ గుర్రాలపై వస్త్రాలు, కత్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పీర్లను ఊరేగింపుగా కోనేరుసెంటరుకు తీసుకువచ్చారు. మళ్లీ వాటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి పంజాల వద్ద ప్రతిష్టించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దట్టీ సమర్పించారు. శాసనసభ మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మున్సిపల్ చెర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్ ,షేక్ అచ్చాబా, అహ్మద్ హుస్సేన్, ఖాజాబేగ్, సయ్యద్‌ఖాజా, ఇలియాస్‌పాషా, మౌలాలి పాల్గొన్నారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్, పలువురు సీఐలు, ఎస్‌లు బందోబస్తును పర్యవేక్షించారు.
Advertisement