వివరాలు వెల్లడిస్తున్న సీఐ, చిత్రంలో నిందితుడు జగన్
►గిరిజన మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ
►నిందితుడు అరెస్టు.. నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు వెల్లడి
కౌడిపల్లి: గిరిజన మహిళ హత్య కేసులో దాదాపు నెల రోజులకు మిస్టరీ వీడింది. కోరిక తీర్చలేదన్న కోపంతో మరిదే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చినట్టు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు తెలిపారు. మంగళవారం ఆయన ఎస్ఐ శ్రీనివాస్‌తో కలిసి కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాలు ఇలా...
మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధి మొండితండాకు చెందిన మూడ్ సాలి (56) గత నెల 8వ తేదీ రాత్రి హత్యకు గురైంది. ఈ ఘటన మరుసటి రోజు వెలుగు చూసింది. మూడు సాలి తన పొలంలోని కూరగాయలను రోజూ వెంకట్రావ్‌పేటగేట్ వద్దకు వెళ్లి విక్రయించి రాత్రికి తిరిగి ఇంటికి వచ్చేది. రోజూ మాదిరిగానే గత నెల 8న కూరగాయలు అమ్మేందుకు వెళ్లిన సాలి రాత్రికి ఇంటికి రాలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం రైస్‌మిల్ సమీపంలోని వాగులో సాలి మృతదేహాన్ని గుర్తించారు.
సాలిపై అదే తండాకు చెందిన వరుసకు మరిది (పాలివారు) అయిన మూడ్ జగన్ (46) గత కొన్నాళ్లుగా కన్నేశాడు. ఆ రోజు జగన్ రాత్రి వ్యవసాయం పొలం వద్దకు వచ్చాడు. ఇంతలో సాలి కూరగాయలు అమ్ముకుని ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. సమీపంలో ఎవరు లేని విషయాన్ని గమనించిన జగన్ తన కోరిక తీర్చాలని సాలిని బలవంత పెట్టాడు. ఆమె లొంగకపోవడంతో వాగువైపు ఎత్తుకెళ్లాడు.
నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆమె అరుపులు ఎవరికి విన్పించలేదు. ఆమె గొంతు పిసకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె మర్మాంగంలో కట్టెతో కెలికాడు. ఒంటిపై ఉన్న దుస్తులతో ఆమె గొంతుకు కట్టి ఊపిరాడకుండా చేశాడు. ఒకవేళ బతికి ఉండే జరిగిన విషయం తండాలో చెబుతుందని భయపడి ఆమె వద్ద ఉన్న బస్తాలో నుంచి అరకిలో బాటుతో ముఖం, తలపై కొట్టి చంపాడు. అక్కడి నుంచి జారుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం తండావాసులు మృతదేహం గుర్తించడంతో పోలీసులు, జాగిలం, క్లూస్‌టీంతో విచారణ నిర్వహించారు. జాగిలం జగన్ ఇంటివద్దకు, మృతురాలి ఇంటివద్దకు వెళ్లి ఆగింది. ఈ క్రమంలో పోలీసులు అనుమానంతో జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు. మృతురాలికి భర్త పూల్‌సింగ్ ఇద్దరు కొడుకులు కోడళ్లు ఉన్నారు.