హత్య చేసి బెడ్‌రూమ్‌లో పూడ్చి..
♦ పాతబస్తీలో ఎన్‌ఆర్‌ఐ యువకుడి దారుణ హత్య
♦ వివాహేతర సంబంధాలే కారణమని అనుమానాలు
♦ హతుడి స్నేహితుడి సమాచారంతో వెలుగులోకి..
♦ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్
హైదరాబాద్: వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ ఎన్‌ఆర్‌ఐ దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు నిర్మాణంలో ఉన్న ఇంటి పడకగదిలో మృతదేహాన్ని పాతిపెట్టారు. హతుడి స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని వెలికితీసిన ఫలక్‌నుమా పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం ఉదయం హత్య వెలుగులోకి రాగా.. రాత్రికి పోలీసులు కేసు ఛేదించారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ కథనం ప్రకారం..
విచ్చలవిడిగా వివాహేతర సంబంధాలు...
ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇమ్రాన్(35) అబుదాబిలోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆబుదాబిలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని పెద్దమ్మ కుటుంబం చాంద్రాయణగుట్టలో ఉంటోంది. ఇమ్రాన్ అబుదాబి నుంచి వచ్చినప్పుడల్లా బహుమతులు.. విందులతో పెద్దమ్మ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో పెద్దమ్మ కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఖతర్‌లో ఆర్మీ ఉద్యోగిగా ఉన్న పెద్దమ్మ కుమారుడు సయీద్ బిన్ సాబెత్ బారాబూద్ భార్య ఫాతిమాతోనూ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని సయీద్ సోదరుడు సైఫ్(22) గమనించి.. విషయాన్ని సోదరుడికి తెలిపాడు. అవివాహిత అయిన సయీద్ సోదరినీ ఇమ్రాన్ వేధించడం మొదలుపెట్టడంతో ఇమ్రాన్‌ను మట్టుబెట్టాలని సయీద్, సైఫ్ నిర్ణయించుకున్నారు.
సయీద్ భార్యతో ఫోన్ చేయించి..
ఇమ్రాన్ అబుదాబి నుంచి వచ్చిన విషయం సయీద్, సైఫ్ తెలుసుకున్నారు. హత్య పథకాన్ని అమలు చేయడానికి బండ్లగూడ ఫారూఖ్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 4న సాయంత్రం ఇమ్రాన్‌కు ఫాతిమాతో ఫోన్ చేయించి పిలిపించారు. ఫలక్‌నుమా రైతుబజార్‌కు వచ్చిన ఇమ్రాన్ ఫాతిమాతో కలసి ఫారూఖ్‌నగర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాపుకాసిన సయీద్, సైఫ్ కారం కలిపిన నీళ్ళను ఇమ్రాన్‌పై పోసి.. కత్తులతో గొంతు కోసి హతమార్చారు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఆధారాలు లేకుండా శుభ్రం చేశారు.
స్నేహితుడి సాయంతో తరలించి..
మరుసటి రోజు శవాన్ని వేరే ప్రాంతానికి తరలించి మాయం చేయాలని భావించి.. స్నేహితుడు హాశంఅలీ(25) సాయం తీసుకున్నారు. రాత్రి టాటా సుమోలో శవాన్ని తీసుకుని చాంద్రాయణగుట్టలో నిర్మాణంలో ఉన్న సయీద్, సైఫ్ ఇంటికి తీసుకువచ్చారు. దీని పడకగదిలో గొయ్యి తీసి అందులో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. తర్వాత సయీద్ దుబాయికి వెళ్లిపోయాడు.
హతుడి స్నేహితుడి సమాచారంతో..
ఫాతిమా ఫోన్ చేసినప్పుడు ఇమ్రాన్ స్నేహితుడు సర్వర్‌తో కలసి ఉన్నాడు. సర్వర్‌తో కలిసే రైతుబజార్‌కు వెళ్ళాడు. అక్కడ నుంచి సర్వర్‌ను పంపేసిన ఇమ్రాన్ ఫాతిమాతో వెళ్లిపోయాడు. ఇమ్రాన్ ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి అఫ్షా.. సర్వర్‌ను ప్రశ్నించింది. ఫాతిమా విషయం చెప్పడంతో అఫ్షా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల ఆధారంగా..
ఫలక్‌నుమా రైతుబజార్ వద్ద సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఇమ్రాన్ ఓ మహిళతో కలసి వెళ్తున్నట్లు గుర్తించి లోతుగా దర్యాప్తు చేశారు. సాంకే తిక ఆధారాలు, ఇతర అంశాలను బట్టి గురువారం ఉదయానికి ఇమ్రాన్ హత్యకు గురైనట్లు నిర్ధారించుకున్నారు. దీంతో సాయంత్రానికి సైఫ్, హాషంలను అరెస్టు చేశారు. వీరి నుంచి హత్యకు వినియోగిం చిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఫాతిమా కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. దుబాయ్ పారిపోయిన నిందితుడు సయీద్ కోసం పోలీసులు ఎల్‌వోసీ జారీ చేసేందుకు సిద్ధమయ్యారు.