నిలువు దోపిడీ
Published Fri, Oct 7 2016 10:17 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* హైబ్రిడ్ సీడ్స్ పేరుతో మామూలు విత్తనాలు
* మూడు రెట్లు అధికంగా అమ్మిన డీలర్లు
* తనిఖీల్లో వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు
* ఇష్టారాజ్యంగా విత్తన కంపెనీలకు సర్టిఫికెట్లు
* కీలకపాత్ర పోషించిన జేడీ కార్యాలయం
సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లాలో నకిలీ విత్తనాలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సూత్రధారుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రత్యేక బృందాలను ఇందుకు నియమించారు. ఈ బృందాలు విత్తనాలు అమ్మిన కంపెనీ డీలర్లు, నష్టపోయిన రైతులను కలిసి ప్రత్యేకంగా నివేదిక రూపొందిస్తున్నాయి. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లు సమాచారం. గుంటూరులోని రాజాగారితోటలో ఏడుగురు విత్తన డీలర్లు బ్రహ్మపుత్ర కంపెనీ వారికి కిలో మిర్చి విత్తనాలను రూ.16 వేలకు విక్రయిస్తే, వీరు బండమీది పల్లె రైతులకు కిలో విత్తనాలను రూ.40 వేల నుంచి రూ.48 వేల వరకు అమ్మినట్లు విచారణ బృందాల తనిఖీల్లో వెల్లడైనట్లు తెలిసింది. ఇలా 100 కిలోలకు పైగా విత్తనాలు అమ్మినట్లు తనిఖీ బృందంలోని సభ్యుడు మంత్రి పుల్లారావు దృష్టికి తెచ్చారు. ఇవిగాక మరో 150 కేజీల విత్తనాలను ఇన్వాయిస్ బిల్లులు లేకుండా ఇష్టమొచ్చినట్లు అధిక ధరలకు అమ్మి రైతులను నిలువు దోపిడీ చేశారు. ఇలానే జిల్లాలో మామూలు విత్తనాలను హైబ్రిడ్‌గా చూపి పెద్ద ఎత్తున రైతులకు డీలర్లు, కంపెనీలు టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు వ్యవసాయశాఖ కార్యాలయంలోని ఓ అధికారి సహకరించినట్లు సమాచారం. దీంతో పాటు విత్తన కంపెనీలు అమ్ముకునేందుకు వ్యవసాయాధికారులు పెద్ద ఎత్తున సర్టిఫికెట్లు ఇచ్చారంటూ గురువారం జరిగిన తెలుగుదేశం శిక్షణ తరగతుల్లో వ్యవసాయ శాఖ మంత్రిని కొంత మంది రైతులు కలిసి ఫిర్యాదు చేయడం ఇందుకు ఊతమిస్తోంది. సీడ్ సర్టిఫై చేసిన వారిపై 15 రోజుల లోపు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డిని మంత్రి ఆదేశించడం గమనార్హం.
కొరవడిన పర్యవేక్షణ...
జిల్లాలో నకిలీ విత్తనాలు, బయోలు, ఫెర్టిలైజర్స్‌పై వ్యవసాయాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో జిల్లాలో నకిలీ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇవి రైతుల పాలిటి శాపంగా మారుతున్నాయి. బయోలపై చర్యలు తీసుకుంటామని మంత్రి రెండేళ్లుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పేపరు ప్రకటనలతో హడావిడి తప్ప, కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మంత్రి మాటలకు విలువ లేకుండా పోయిందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో సైతం మంత్రి పేరుతో కొంతమంది వ్యవవసాయాధికారులు దందా కొనసాగిస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరించడం వల్లే జిల్లాలో ఈ పరిస్థితి దాపురించిదని అన్నదాతల్లో చర్చ సాగుతోంది. మంత్రి పేరు చెప్పి కొంతమంది వ్యవసాయాధికారులు విత్తనాల పంపిణీ సమయంలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది. వ్యవసాయాధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి చర్యలు తీసుకుంటారా లేక అధికారులకు కొమ్ముకాస్తారా అన్నది వేచిచూడాలి.
Advertisement
Advertisement