లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి: బుద్ధా వెంకన్న
గుణదల, వన్‌టౌన్ (విజయవాడ): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కోరారు. ఇందుకోసం తన పదవిని సైతం త్యాగం చేస్తానని, బుధవారం ముఖ్యమంత్రిని కలసి తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో చురుగ్గా ఉండే లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అటు పార్టీ, ఇటు ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందన్నారు. చంద్రబాబు పాలన చూసే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని, లోకేశ్‌కు మంత్రి పదవి ఇస్తే మరింతమంది రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
నా సీటు ఇస్తా : బోడె ప్రసాద్
లోకేశ్ కోసం అవసరమైతే తన సీటు ఖాళీ చేసి ఇస్తానని పెనమలూరు శాసనసభ్యు డు బోడె ప్రసాద్ అన్నారు. లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేస్తారని వస్తున్న ఊహగానాలపై ఒక టీవీ చానల్‌తో ఆయన మాట్లాడారు. లోకేశ్ కోసం పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. లోకేశ్ పోటీ చేస్తానని చెప్పగానే తాను రాజీనామా చేస్తానని, అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.