'లోకేష్పై వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్కి మంత్రి పదవి ఇవ్వాలంటూ తాను చేసిన ప్రకటనపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఖండించారు. గురువారం విజయవాడలో బుద్ధా వెంకన్న విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... లోకేష్పై జేసీ దివాకర్రెడ్డి వ్యంగంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. తీరు మార్చుకోవాలంటూ జేసీకి బుద్ధా వెంకన్న హితవు పలికారు. టీడీపీ వల్లే బీజేపీకి నాలుగు సీట్లు వచ్చిన సంగతి మరవరాదన్నారు. బీజేపీ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఓ అజెండాతో తమ పార్టీ నాయకుడు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
లోకేష్కి మంత్రి చేపట్టేందుకు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇటీవల ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తాని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అదే పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఈ అంశంపై బుధవారం హైదరాబాద్లో ఈ విధంగా స్పందించారు.
లోకేష్కు మంత్రిని చేయడం ఆయన తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఇష్టమని అన్నారు. లోకేష్ కోసం రాజీనామాలు చేస్తామనడం అంతా మెహర్భానీ మాటలుగా జేసీ అభివర్ణించారు. కులసంఘం తీర్మానించిందని లోకేష్ను మంత్రిని చేయడం కాదని జేసీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యాలపై బుద్ధా వెంకన్న పైవిధంగా స్పందించారు.