కలెక్టరేట్ ఎదుట ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ల ధర్నా
ముకరంపుర : ప్రైవేట్ విద్యాసంస్థల బస్‌డ్రైవర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఆ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు గుడికందుల సత్యం మాట్లాడుతూ ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకే వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు డ్రైవర్లు, హెల్పర్లకు రూ.6–8 వేల వేతనం మాత్రమే ఇస్తూ శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని అన్నారు. 75 శాతం ప్రైవేట్ స్కూళ్లలో హెల్పర్లను నియమించకుండా డ్రైవర్లతోనే అన్ని పనులు చేయిస్తున్నారని, పీఎఫ్, బోనస్ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మిక శాఖ జిల్లా ఉపకమిషనర్ సమక్షంలో ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు జూన్ నుంచి కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి హామీని విస్మరించారని తెలిపారు.
హామీలను అమలు చేయకుంటే ఆగస్టు మొదటి వారంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల కిషన్, అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు పి.నర్సింగం, నగర ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాస్, వేములవాడ అధ్యక్షుడు ఎం.రవి, ప్రధాన కార్యదర్శి తిరుపతి, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులున్నారు.