మంత్రివర్గ విస్తరణ అప్రజాస్వామికం
• చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం
• సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు విమర్శ
• సీపీఐ ఆధ్వర్యంలో తిరుపతిలో ధర్నా
తిరుపతి కల్చరల్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తూ నైతిక విలువలకు పాతరేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు విమర్శించారు. అప్రజాస్వామికంగా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ విస్తరణను వ్యతిరేకిస్తూ సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పశువులను సంతలో బేరమాడినట్లు కొనుగోలు చేశారని దుయ్యబట్టారు.
ఇతర రాజకీయ పార్టీ గుర్తులతో గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ముంటే 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉప ఎన్నిక నిర్వహించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామిశెట్టి వెంకయ్య, నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ బాబు తనయుడికి మంత్రి పదవి ఇవ్వడం కోసమే దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమాజం నుంచి బహిష్కరించాలని కోరారు. రోజుకో పార్టీ మారే ఎమ్మెల్యేలతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జె.రామచంద్రయ్య, కె.రాధాకృష్ణ, ఎన్‌డీ.రవి, ఎన్.శ్రీరాములు, వి.లక్ష్మయ్య, చిన్నం కాళయ్య తదితరులు పాల్గొన్నారు.