జాగ్రత్త పడకపోతే మునిగిపోతాం
సాక్షి, అమరావతి: పార్టీలో కార్యకర్తలు, నాయకుల మధ్య అంతరం పెరిగిపోతోందని, ఈ సమస్యను అధిగమించకపోతే నిట్టనిలువునా ముగినిపోతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని, సంతృప్తస్థాయి ఎక్కువగా ఉందని చెప్పారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఉండాల్సిన సత్సంబంధాలు ప్రస్తుతం లేవని, వారి మధ్య అంతరం పెరుగుతోందని, ఇది మరింత పెరిగితే పార్టీకి ప్రమాదమని చెప్పారు.బాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ, మంత్రివర్గ సమావేశం గురువారం వెలగపూడిలోని సచివాలయంలోని సీఎం కార్యాలయంలో తొలిసారి జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్న వారు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి...
హా ‘రాష్ట్రంలోని 21 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగా లేదు. ఇపుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలుగా ఉన్న వారు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారు వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులుగా ఉంటామని భావించవద్దు. సర్వేల్లో నేతల పట్ల సానుకూలత లేదంటే మార్పులు ఖాయం.’ అని బాబు చెప్పారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే అసంతృప్తితో ప్రజలున్నారు. ఇపుడు పెద్ద నోట్ల రద్దు, బంగారం నిల్వలపై ఆంక్షల వల్ల అది మరింత పెరుగుతోంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయాల్లో మన పాత్ర ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు విశ్వసించటం లేదు.
ఆ పార్టీతో పొత్తు వల్ల వారు తీసుకునే నిర్ణయాల ప్రభావం మనపై పడుతోంది. బంగారంపై కేంద్రం పెట్టే ఏ షరతైనా మహిళల్లో వ్యతిరేకత పెంచుతుంది. తాజా గా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ గా మీరే ఉన్నారు. బంగారం నిల్వలపై ఆంక్షలు వాపసు తీసుకునేలా చూడండి’ అని నేతలు బాబుకు సూచించారు. ఆయన కేంద్ర మంత్రి వెంకయ్య తో మాట్లాడారు. ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నాయని, తాము కూడా ఓ వివరణ ఇస్తామని వెంకయ్య చెప్పినట్లు సమాచారం.
నగదు కోసం ఎదురు చూడకండి
నగదు రహిత లావాదేవీల అధ్యయన కమిటీ కన్వీనర్‌గా ఉన్న సీఎం చంద్రబాబు గురువారం కమిటీ సభ్యులు, బ్యాంకు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్‌స జరిపారు. భౌతిక నగదుకోసం ఎదురు చూడకుండా ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లాలని ప్రజలకు సూచించారు.