ఎసీ్టల్లో చేర్చేందుకు క్యాబినేట్ చర్యలు
ప్యాపిలి: వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేర్చేందుకు క్యాబినేట్ చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ప్యాపిలిలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని క్యాబినేట్ ద్వారా కేంద్రానికి సిఫారస్ చేస్తామన్నారు. వాల్మీకులు తమ హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామనే హామీపై కాలయాపన చేయడం తగదన్నారు. వాల్మీకి జయంతిని అధికారికంగా జరపాలని కేవలం ఒక రోజు ముందు జీవో విడుదల చేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. అంతకు ముందు పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో రిటైర్డు మైనింగ్ ఎండీ రాజగోపాల్, కర్నూలు సీఐడీ డీఎస్‌పీ వెంకటరామయ్య, ఆలూరు, మంత్రాలయం జెడ్పీటీసీ సభ్యులు రాంభీం నాయుడు, లక్ష్మయ్య, ప్యాపిలి ఎంపీపీ సరస్వతి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు పత్తికొండ ఎంపీపీ గోవిందు, పామిడి మార్కెట్‌యార్డు చైర్మన్ సుంకిరెడ్డి, వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, డోన్ మాజీ జెడ్పీటీసీ వలసల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.