
వేధింపుల కేసులో టీడీపీ నాయకుడి అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నంలో కాల్ మనీ సెక్స్ రాకేట్ తరహా కేసులో నిందితుడు, టీడీపీ నాయకుడు గుడివాడ రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పులు తీసుకున్న మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న గుడివాడ రామకృష్ణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు అరిలోవకు చెందిన ఓ మహిళ ఇటీవల విశాఖపట్టణంలోని పట్టణ నాలుగో పోలీస్ స్టేషన్లో గుడివాడ రామకృష్ణపై ఫిర్యాదు చేసింది.
అందులోభాగంగా పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయం గమనించిన రామకృష్ణ విశాఖ నుంచి పరారైయ్యారు. అతడి కోసం పోలీసుల గాలింపు తీవ్రతరం చేశారు. ఆ క్రమంలో అతడు చెన్నైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బుధవారం గుడివాడ రామకృష్ణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గురువారం విశాఖపట్నం నగరానికి తీసుకు వచ్చారు. గుడివాడ రామకృష్ణని జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించినట్లు విశాఖపట్నం డీసీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. అంతకుముందు గుడివాడ రామకృష్ణను త్రివిక్రమ వర్మ మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ... రామకృష్ణ వల్ల బాధితులుగా మారిన వారు ఎవరైనా తమ వద్దకు వచ్చి... ఫిర్యాదు ఇవ్వవచ్చని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.