సాక్షి, సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరంలో వివిధ పన్నుల చెల్లింపుదారులైన ఆహార భద్రత కార్డుదారులపై వేటు పడింది. పౌరసరఫరాల శాఖ ఆధార్ అనుసంధానంతో సుమారు రూ.1.02 లక్ష కుటుంబాలను పన్ను చెల్లింపుదారులుగా గుర్తించి రేషన్ కార్డులను తొలగించింది. ఫలితంగా సుమారు 3.50 లక్షల యూనిట్లు రద్దయ్యాయి. సొంత ఇళ్లు, వాహనదారులతో పాటు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండి వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తించింది.
జీహెచ్‌ఎంసీ, ఆర్టీఏ, వాణిజ్య పన్నులశాఖ నుంచి వివరాలను సేకరించి ఈ–పీడీఎస్‌తో అనుసంధానం చేసింది. దీంతో సొంత గృహాలు, నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు, బడా వ్యాపారులు సైతం ఆహార భద్రత కార్డు దారులుగా నమోదైనట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ–పీడీఎస్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఆధారంగా వాటిని తొలగించింది.