బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించాలి
-
ఎన్‌సీఎల్‌పీ జిల్లా డైరెక్టర్ వెంకటేశ్వర్లు
గుంటూరు వెస్ట్ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో వలంటీరు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు(ఎన్‌సీఎల్‌పీ) జిల్లా డైరెక్టర్ ఐ.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని బాలకార్మిక ప్రత్యేక కేంద్రాలలో పనిచేసే వలంటీరు ఉపాధ్యాయులకు రెండురోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులు కలెక్టర్ బంగ్లారోడ్డులోని మహిళా ప్రాంగణ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలు ఉండగా అందులో 1150 మంది బాలలకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సక్రమంగా వినియోగించి బాల కార్మికులను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శిక్షణ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వలంటీరు ఉపాధ్యాయులు ఆధునిక పద్ధతులను అనుసరించి విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్.కే.విశ్వనాథం మాట్లాడుతూ బాలకార్మికులను గుర్తించడం, గుర్తించిన వారిని కేంద్రాలకు తరలించి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రధాన జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చూడాలని చెప్పారు. మహిళా ప్రాంగణం మేనేజర్ బీ.స్వరూపరాణి మాట్లాడుతూ బెగ్గింగ్ వ్యవస్థలోకి పిల్లలు రాకుండా నిరోధించాల్సిన బాధ్యత బాలకార్మిక కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బందిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యా మిషన్ సీఎంఓ ఎం.లక్ష్మీనారాయణ, ఆల్టర్నేటివ్ స్కూల్సు కోఆర్డినేటర్(ఏఎల్‌ఎస్‌సీ) అనంతయ్య, జీ.రామకష్ణ, రీసోర్సుపర్సన్లు తదితరులు పాల్గొన్నారు.