car accident
- మృతదేహంతో స్థానికుల రాస్తారోకో
- ఆందోళనకారులకు అండగా వైఎస్సార్ సీపీ నేత బుర్రా
- హైవే మేనేజ్‌మెంట్, సీఐ హామీతో ఆందోళన విరమణ
-కనిగిరి మండలం మాచవరం వద్ద ఘటన..
కనిగిరి : వేగంగా వచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. న్యాయం చేయాలంటూ మృతుని బంధువులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో హైవేపై ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండలంలోని మాచవరం వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాలి నర్శింహులు మూడో కుమారుడు మధు (11) కంచర్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా పామూరు నుంచి కనిగిరి వైపు వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బాలుడు మధు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న సహచర విద్యార్థులు ఆ దృశ్యాన్ని చూసిన భయాందోళనకు గురై కేకలు పెట్టారు. స్థానికులు గమనించి ఘటన స్థలికి వచ్చేలోపే కారు ఆగకుండా వెళ్లిపోయింది.
తల్లఢిల్లిన మాతృ హృదయం
స్కూల్‌కు వెళ్లి వస్తానని చెప్పిన కుమారుడిని నిమిషాల వ్యవధిలో మృత్యు కబళించడంతో ఆ మాతృహృదయం తల్లఢిల్లింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు చిన్న వయసుల్లో అనంతలోకాలకు చేరడంతో తల్లి హజరతమ్మ కన్నీటిపర్యంతమైంది. స్కూల్ బస్సు ఎక్కేందుకు వచ్చిన తోటి విద్యార్థి కళ్లదుటే చనిపోవడంతో సహ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. బాలుడు మధు మృతితో కంచర్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలకు సెలవు ప్రకటించి ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.
మృతదేహంతో రోడ్డెక్కిన ప్రజలు
కళ్లముందే బాలుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువడికి చేర డంతో గ్రామస్తులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుకిరువైపులా కర్రలు, రాళ్లు పెట్టి వాహనాలు ఆపి బాలుడి మృతదేహంతో రాస్తారోకో చేశారు. హైవే అధికారుల తీరును దుయ్యబట్టారు. సీఐ సుధాకర్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకుని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు అండగా నిలిచారు. హైవే అధికారుల నిర్లక్ష్యాన్ని, పోలీసుల వైఖరిని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ నిలిచింది. హైవే అధికారులు వచ్చి తగు చర్యలు తీసుకునేంత వరకూ రోడ్డుపై నుంచి మృతదేహాన్ని తీయమంటూ బైఠాయించారు. కొద్ది సేపటి తర్వాత సీఐ.. హైవే అధికారులను పిలిపించి మాట్లాడారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆందోళనకారులు శాంతించలేదు. గతంలో కూడా ఇలానే చెప్పారని, కొత్తగా రోడ్డు వేశాక గ్రామస్తులు ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని ప్రజలు మండిపడ్డారు. కనీస ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేయలేదంటూ సీఐతో వాదనకు దిగారు.
పోలీసులపై బుర్రా మండిపాటు
పిల్లవాడిని పోగొట్టుకున్న బాధలో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని వైఎస్సార్ సీపీ నేత బుర్రా మధు ఖండించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, హైవే మేనేజŒ మెంట్ అథారిటీ అధికారులను సత్వరం పిలిపించాలని డిమాండ్ చేశారు. చేసేది లేక హైవే కనిగిరి ప్రాంత మేనేజర్ సింగ్‌ను పిలిపించారు. గ్రామాల్లో జీబ్రా లైటింగ్, సైట్ మార్కింగ్, ఇన్ సెట్ స్పీడ్ బ్రేకర్స్, లైన్ స్లో మార్కింగ్, విలేజ్ జోన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి మృతికి కారణమైన కారును రెండు రోజుల్లో పట్టుకుని చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను తాత్కలికంగా విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.