machavaram
-
దాడిచేసింది వారు.. మాపై కేసులా?
మాచవరం: వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించామన్న కోపంతో మా ఇళ్లపై దాడులు చేసి... బీభత్సం సృష్టించిన టీడీపీ వర్గీయులను వదిలేసి... బాధితులైన మాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మాచవరం పోలీస్‌స్టేషన్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజున ఓట్లు వేసేందుకు వచ్చిన మమ్ములను అడ్డుకున్నారనీ, ఇదేమని ప్రశ్నించిన వారిపై దూషణకు దిగి, పోలింగ్ అనంతరం మీ సంగతి చూస్తామంటూ బెదిరించారని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఇతర గ్రామాలకు చెందిన టీడీపీ రౌడీలను కార్లలో తీసుకువచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళలను దూషిçస్తూ, భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బైకులు, ఆటోలు, ఇతర వాహనాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని, భయాందోళనతో మేమంతా పొలాల వెంట పరుగులు తీశామని, మహిళలు గంగమ్మగుడిలో తలదాచుకున్నారని చెప్పారు. అక్కడకు కూడా వెళ్లి గుడి గేటు తాళాలు బిగించి ఇబ్బందులు పెట్టారని, సుమారు నాలుగు గంటల పాటు టీడీపీ గూండాలు గ్రామంలో వీరంగం చేస్తుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా గ్రామానికి రాలేదన్నారు. విషయం తెలుసుకున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించేందుకు గ్రామానికి మరునాడే చేరుకుని మహిళలను ఇళ్ల వద్దకు చేర్చి, విధ్వంసానికి గురైన ఇళ్లను, ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్న సమయంలో వారిపైనా దాడికి యత్నించారని చెప్పారు. రాళ్లతో దాడిచేసి, కార్లను సైతం పగలగొట్టారని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు గాలిలోకి కాల్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాము భయంతో వేరే ఊళ్లో తలదాచుకుంటే తమపై కేసులు పెట్టడం దారుణమన్నారు.మాపై కేసులు పెట్టడం అన్యాయంగ్రామంలో టీడీపీ వాళ్లు సృష్టించిన బీభత్సానికి భయంతో గ్రామాన్ని విడిచి పొరుగూరిలో బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నాం. భార్యాపిల్లలు ఇంటి వద్ద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామంలో వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊళ్లో లేని మాపై పోలీసులు కేసులు పెట్టడం అన్యాయం. – అంబటి వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీకి ఓటేశామనే మాపై కక్షవైఎస్సార్సీపీకి ఓటేశామని మాపై కక్ష పెంచుకున్నారు. బీసీలకు పార్టీలు ఎందుకురా అంటూ పలుసార్లు అవమానించారు. అయినా ఓర్చుకొని పార్టీకోసం నిలబడ్డాం. వారి దాడులతో ఊరు వదిలి వెళ్లి ఐదు రోజులైంది. మాపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. – మేకల హనుమంతుపోలీసులు రక్షణ కల్పించాలిఎన్నికల రోజు టీడీపీ గూండాలు చేసిన దాడులకు భయపడి పారిపోయాం. భార్యా పిల్లలతో బంధువుల వద్ద తలదాచుకుంటున్నాం. టీడీపీ వాళ్లు దాడులు చేస్తే మాపై కేసులు పెట్టారు. ఇదేమి న్యాయం. గ్రామంలోకి వెళ్లాలంటే భయంగా ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలి. – బొంతా ప్రసాద్ -
కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ‘మాయమైపోతున్నడమ్మా’
రాయవరం(కోనసీమ జిల్లా): ‘‘మాయమైపోతున్నడమ్మా...మనిషన్న వాడు...మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు’’.. అంటూ తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ రాసిన గేయం రాయవరం మండలం మాచవరం సమీపంలో జరిగిన హత్యోదంతాన్ని గుర్తుకు తెస్తోంది. గత నెల 24న కొవ్వూరి సత్యవేణి (54) హత్యకు గురైన విషయం విదితమే. మాచవరం శివారు దేవుడు కాలనీకి చెందిన ఇద్దరు అవివాహిత సోదరులు ఆమెపై తొలుత అత్యాచారం చేసి, ఆనక హత్య చేశారు. ఈ ఘటన హతురాలి కుటుంబాన్నే కాదు హత్యకు పాల్పడిన వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. గతంలో దేవుడు కాలనీకే చెందిన అన్నదమ్ములు నల్లమిల్లి ఉమామహేశ్వరరెడ్డి, నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డిలు సత్యవేణిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆమె బయట పెట్టడంతో అన్నదమ్ములు ఆమెపై కక్ష పెంచుకుని, ఈ దురాఘతానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆ సోదరుల తల్లి నల్లమిల్లి పద్మ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల విచారణలో వాస్తవాలు బయట పడడంతో అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు. దాంతో వారి కుటుంబం రోడ్డున పడింది. హతురాలి కుమారుడి మూగ వే(రో)దన.. హతురాలు సత్యవేణి భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మూగ, చెవిటి వాడైన చిన్న కుమారుడు ఉమామహేశ్వరరెడ్డిని తల్లి సత్యవేణి కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. తల్లి సత్యవేణి హత్యకు గురైన విషయం ఉమామహేశ్వరరెడ్డికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. 15 రోజులుగా తల్లి కనిపించకపోవడంతో అతడు ఆహారం తీసుకోవడం లేదు. అమ్మ వస్తుందని చెప్పినా వినకుండా ఒంటరిగా గదిలోనే గడుపుతున్నాడు. ఉమామహేశ్వరరెడ్డిని ఎలా ఊరడించాలో తెలియక తాతయ్య ద్వారంపూడి గంగరాజు మదనపడుతున్నాడు. చదవండి: ‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’ కఠినంగా శిక్షించాలి కొవ్వూరు సత్యవేణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ పూర్వపు జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు డిమాండ్ చేశారు. మానవత్వం మరచి అత్యాచారం చేసి మహిళలను హతమార్చిన నిందితులను దిశ చట్టం ప్రకారం ప్రభుత్వం 21 రోజుల్లో శిక్షించాలని అన్నారు. కొవ్వూరి సత్యవేణి కుటుంబసభ్యులను సిద్ధు పరామర్శించారు. -
తురకపాలెం గ్రామం ప్రత్యేకత ఇదే..
భారతీయ సంస్కృతిలో భాగమైన భిన్నత్వంలో ఏకత్వ భావనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెం గ్రామం. గ్రామంలోని ముస్లిం శిల్పకళాకారులు తరతరాలుగా హిందూ ఆలయాలకు ధ్వజ స్తంభాలను చెక్కే వృత్తిలోనే కొనసాగుతూ.. రాముడైనా.. రహీమ్ అయినా తమకొక్కటేనని చాటుతున్నారు. తాము చేసే పనిలో దైవాన్ని చూస్తామంటున్నారు. తురకపాలెం గ్రామంలో అందరూ ముస్లింలే. ఇతర మతస్తులెవరూ లేరు. ఈ గ్రామానికి ఉత్తరం వైపున ప్రభుత్వ పోరంబోకు భూములు ఉన్నాయి. సదరు భూముల్లో లభించే బండరాతితో హిందువులు పవిత్రంగా భావించి దేవాలయాల్లో ప్రతిష్ఠించే ధ్వజస్తంభాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. – సాక్షి, అమరావతి బ్యూరో, మాచవరం వంద కుటుంబాలకు ఇదే వృత్తి.. సుమారు వందేళ్ల క్రితం తురకపాలెం గ్రామానికి చెందిన కరీమ్ సాహెబ్ ధ్వజస్తంభాలు చెక్కడం ప్రారంభించారు. తర్వాతి రోజుల్లో ఆయన కుటుంబీకులతోపాటు గ్రామానికి చెందిన మరికొన్ని ముస్లిం కుటుంబాలు దీనినే వృత్తిగా చేసుకున్నాయి. కరీమ్ సాహెబ్ నాలుగో తరానికి చెందిన కుటుంబాలు కూడా నేటికీ ఇదే వృత్తిలో రాణిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామంలో వందకుపైగా కుటుంబాలు ఈ కళనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ధ్వజస్తంభాలు సరఫరా అవుతుంటాయి. రూపుదిద్దుకున్న ధ్వజస్తంభం రాయిని శిల్పంగా మార్చి.. ధ్వజస్తంభం తయారు చేయాలంటే 10 మంది నుంచి 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడి 30 నుంచి 40 రోజుల వరకు పని చేయాల్సి ఉంటుంది. మొదటగా రాయిని గ్రామంలోని కొంత మంది కార్మికులు కలిసి ఎన్నుకుంటారు. 20 అడుగుల నుంచి 50 అడుగుల ధ్వజస్తంభం తయారు చేయటానికి 800 నుంచి 1,200 పనిదినాలు కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. ధ్వజస్తంభం ఎత్తును బట్టి అడుగుకు రూ.3,500 నుంచి రూ.4 వేల చొప్పున ధర ఉంటుంది. రాయిని శిల్పంగా మార్చి పవిత్రమైన ధ్వజస్తంభం తయారు చేసే సమయంలో వీరు ఎంతో నిష్టగా ఉంటారు. ధ్వజస్తంభం పూర్తయిన తర్వాత జాగ్రత్తగా లారీలోకి ఎక్కించి ఆలయానికి చేర్చే బాధ్యత కూడా వీరే చేపడతారు. మార్గమధ్యంలో దురదృష్టవశాత్తూ ధ్వజస్తంభం విరిగితే మళ్లీ కొత్తది తయారు చేసి అందిస్తారు. ఎంతో ఓపిక, నైపుణ్యంతో కష్టపడే వీరికి రోజుకు రూ.400 నుంచి రూ.600 మాత్రమే కూలి గిట్టుబాటు అవుతోంది. 30 ఏళ్లుగా ఇదే వృత్తి.. 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాను. తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వేరే పనికి వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. అయితే ప్రస్తుత తరం వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి మొగ్గు చూపడం లేదు. మాతోనే ఈ కళ కనుమరుగవుతుందేమో అనే బాధ ఉంది. మిషన్లు రావటం వల్ల చేతితో తయారు చేసేవారికి అంతగా గుర్తింపు లేకుండా పోతోంది. – షేక్ షరీఫ్,ధ్వజస్తంభ తయారీదారుడు మా కళను గుర్తిస్తున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు నిర్మించినా.. ఆ కమిటీల వాళ్లు ధ్వజస్తంభం ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడకే వస్తారు. మా కళను గుర్తించి వాళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో కొత్త ఆలయాల నిర్మాణాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు. – జాన్ వలీ, ధ్వజస్తంభ తయారీదారుడు ప్రభుత్వం సామాగ్రి అందిస్తే బాగుంటుంది.. ధ్వజస్తంభాలు తయారు చేసేందుకు ఉలి, సుత్తి, శ్రావణం, మలాట్, గడ్డపార లాంటి సామాగ్రి ఎంతో అవసరం. వీటిని కొనుగోలు చేయాల్సి వస్తే చాలా ఖర్చుతో కూడిన పని. మిగతా వృత్తుల వారికి ఏ విధంగా ప్రభుత్వం సామాగ్రి కోసం నగదు లేదా సామాగ్రిని అందిస్తోందో అదేవిధంగా మాకు కూడా సామాగ్రిని అందిస్తే బాగుంటుంది. – ఎగ్జాం వలి, ధ్వజస్తంభ తయారీదారుడు -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన విజయవాడ బీఆర్టీఎస్ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (ఏఆర్ 02 5665) సోమవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. విజయవాడ ఏలూరు రోడ్డు నుంచి బీఆర్టీఎస్ రహదారిపైకి మలుపు తిరుగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం 20మంది గాయపడ్డారు. వీరిలో 14 మందిని ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అమరా దుర్గాప్రసాద్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదుచేశారు. బయల్దేరిన దగ్గర నుంచి డ్రైవర్ మితిమీరిన వేగంతోనే బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపించారు. నెమ్మదిగా వెళ్లమని పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దూకుడుగానే నడిపినట్లు వారు తెలిపారు. -
ప్రేమ పేరుతో మైనర్ బాలిక ట్రాప్..!
సాక్షి, విజయవాడ : ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన ఓ వ్యక్తిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మైనర్ బాలికకు గడ్డం జగదీశ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అతని నిజస్వరూపం బయటపడింది. అమ్మాయికి తరచూ ఫోన్ చేసి వీడియో కాల్స్ మాట్లాడటం. నగ్నంగా ఫొటోలు తీసి శారీరంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేసి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జగదీశ్ మాయలో పడి చాలామంది మోసపోయినట్టు పోలీసుల విచారణలో బయటపడినట్టు సమాచారం. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, తమ కొడుకు కనబడటం లేదని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో జగదీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
కుంటనూ వదలరు.. దారినీ వదలరు
సాక్షి, నాగులుప్పలపాడు (ప్రకాశం): గతంలో ఏర్పడిన ఎన్నో కరువులకు, నీటి ఎద్దడులకు తట్టుకొని పొలాలు, మూగ జీవాలకు నిరంతరంగా నీరు అందించిన కుంట అది. కాలక్రమంలో ఆక్రమణలకు గురై నేడు పక్కనున్న పొలాల రైతులకు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం ఇది. మండలంలోని మాచవరం గ్రామంలోని సర్వే నంబరు 74 లో మెత్తం 13.71 సెంట్లులో లింగన్నకుంట ఉండేది. ఈ కుంట చుట్టు పక్కల పొలాల రైతులకు నీటి వసతి కోసం చాలా అనువుగా ఉండేది. అయితే ఇది కాలక్రమంలో ఆక్రమణలకు గురై నేడు నీటి జాడలు ఉన్నయనడానికే పరిమితమయింది. ఈ సర్వే నంబరులో మొత్తం వీస్తీర్ణంలో కొంత భాగం రిటైర్డు ఆర్మీకి కేటాయించారు. మిగిలిన భాగంలో ఆక్రమణలకు గురయింది. అది అంతటితో కాకుండా చివరకు కుంట కట్టలను కూడా దున్నేసి పొలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కుంటకు ఆవల వైపునున్న పొలాలకు వెళ్లడానికి ఈ కుంట కట్ట మీద గుండానే వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నకట్టను కూడా ఆక్రమించి కలుపుకుపోతే చేలల్లోకి వెళ్లడానికి మార్గం ఏదని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించే పరిస్థితికి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ ఆక్రమణ ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో వర్షాలు పడి కుంట నిండితే కట్ట తెగితే నీరంతా పంట పొలాలలోనే ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అక్రమలు తొలగించి రైతులు పొలాలకు వెళ్లే మార్గంతో పాటు నీటి ఎద్దడిని తీర్చడానికి కుంట విస్తీర్ణం మెత్తాన్ని సరిచేసి కాపాడాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కారం చూపిన మరలా ఇప్పుడు సమస్యలు ఉత్పన్నమవడం భాధాకరంగా ఉందని వాపోతున్నారు. ఇదే విషయమై తహశీల్దార్‌ను వివరణ కోరగా మాచవరం గ్రామంలో లింగన్నకుంటకు సంబంధించి ఆక్రమణల విషయంలో పూర్తి స్థాయిలో విచారించి ఎవరికి ఆటంకం లేకుండా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దారిని కూడా వదలడం లేదు.. మా పొలాలకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం కుంట కట్ట మీద గుండానే వెళ్లాలి. ఇప్పుడు ఈ కట్టను కూడా ఆక్రమించేస్తే ట్రాక్టర్లు కాదు కదా కనీసం మోటారు సైకిళ్లు కూడా పొలాల వద్దకు పోలేవు. ఇకనైనా ఈ సమస్యను పరిష్కరంచాలని కోరుతున్నాం. –ఇనగంటి రాఘవ రెడ్డి, రైతు భయపెడుతున్నారు.. లింగన్న కుంట ఆక్రమణల గురించి ఇప్పటికే పలు సార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. చివరకు కట్ట కూడా ఆక్రమణలకు గురయ్యే పరిస్థితుల్లో కట్ట అవసరత గురించి అడిగితే అక్రమ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడని పరిస్థితుల్లో ఉన్నారు. –కోడెల నెహ్రూ, రైతు -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి
గుంటూరు: మాచవరం మండలం మోర్జంపాడులో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు అకారణంగా దాడి చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మోర్జంపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ అభిమానులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గ్రామంలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు రుచించలేదు. కేవలం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్న కారణంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
మాచవరం మగధీర
రాయవరం (మండపేట) : రాజకుమారుడు గుర్రంపై స్వారీ చేస్తాడని అవ్వాతాతలు కథల్లో చెబుతుంటారు. ఆ మాటలు వింటుంటేనే పిల్లలకు ఎంతో ఉత్తేజం కలుగుతుంది. తామూ గుర్రమెక్కి దౌడు తీస్తున్నట్టు ఊహించుకుంటారు. అలాగే సినిమాల్లో తెరమీద హీరోహీరోయిన్లు గుర్రపు స్వారీ చేస్తుంటే..వారి స్థానంలో తామే స్వారీ చేస్తున్నట్టు భావించి, థ్రిల్లవుతుంటారు. అలాంటిది ఓ పిలగాడు.. ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే గుర్రపు స్వారీ చేస్తూ.. ఎందరికో కలగా ఉండే సరదాను నిత్యకృత్యంగా ఆస్వాదించాడు. ఒకనాటి ఆ బాలుడే రాయవరం మండలం మాచవరానికి చెందిన అంగర శ్రీధర్. ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే.. మాచవరంలో గుర్రపు స్వారీకి కొవ్వూరి వెంకటరెడ్డి(డాబారెడ్డి) పేరు పొందారు. ఆయన చిన్నప్పటి నుంచే గుర్రాలను పెంచడం హాబీగా చేసుకున్నారు. ఆ ఊరికే చెందిన శ్రీధర్ ఆయనను చూసి ఎనిమిదేళ్ల వయస్సు నుంచే గుర్రాలపై స్వారీ చేయడాన్ని అలవాటు చేసుకున్నాడు. గుర్రపు స్వారీపై ఉన్న ఆసక్తితో దాంతో పాటు గత 10 సంవత్సరాలుగా గుర్రాన్ని నియంత్రించడం, దానికి శిక్షణ ఇవ్వడం నేర్చుకున్నాడు. ఇప్పుడు గుర్రాలకు శిక్షణ ఇవ్వడాన్నే ప్రవృత్తిగా స్వీకరించాడు. తనకు అప్పగించిన గుర్రాలను దౌడు తీయించడం, సంజ్ఞల ద్వారా వాటితో కాళ్లు పైకి లేపించడం, సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయించడం వంటి శిక్షణ ఇస్తున్నాడు. ఇంతవరకూ 15 గుర్రాలకు శిక్షణ.. ఇప్పటి వరకు 15 గుర్రాలకు శిక్షణ ఇచ్చానని శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపాడు. రాజమహేంద్రవరం, కైకవోలు, పెద్దాపురం తదితర గ్రామాల నుంచి గుర్రాలను శిక్షణ నిమిత్తం తెచ్చారని, గుర్రాలపై ఉన్న మమకారంతో ఎటువంటి ఫీజు తీసుకోకుండానే శిక్షణ ఇస్తున్నానని తెలిపాడు. చిన్న వయస్సు నుంచే గుర్రాన్ని నియంత్రించడం, స్వారీ చేయడం వలన ఎటువంటి గుర్రాన్నైనా లొంగదీసుకునే చాకచక్యం, శక్తి అలవాటయ్యాయన్నాడు. తాను ప్రత్యేకించి మూడు గుర్రాలను సాకుతున్నానన్నాడు. -
ఇది అంతం కాదు.. ఆరంభం
పిన్నెల్లి (మాచవరం): దుర్మార్గపు టీడీపీ పాలన పతనం పిన్నెల్లి నుంచే ప్రారంభం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేబాట పాదయాత్ర ముగింపు సభ మాచవరం మండంలోని పిన్నెల్లి గ్రామంలో శని వారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైయినా.. ఆటంకాలు వచ్చినా.. చివరకు అక్రమంగా జైలులో పెట్టినా.. మన అధినేత జగన్మోహన్రెడ్డి ధర్మ యుద్ధం చేస్తున్నారని, ఇది అంతంకాదని.. ఆరంభం మాత్రమేనని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టించిన నాయకులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు అధికారం మారితే సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నారని.. తాము అధికారంలోకి వస్తే అటువంటి అధికారులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. టీడీపీ చేస్తున్న ప్రతి అక్రమాలు అన్నింటినీ గుర్తు పెట్టుకుంటున్నామని, తమ కార్యకర్తలపై పెట్టిన కేసులకు వడ్డీతో బదులు తీర్చుకుంటున్నామని స్పష్టంచేశారు. మద్దతు ధర ఏది? రైతులు పండించే పంటలకు టీడీపీ పాలనలో కనీస మద్దతు ధర లభించటంలేదని కాసు మహేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింల సంక్షేమానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషిని గుర్తుచేశారు. చంద్రబాబు క్యాబినెట్లో 26 మంది మంత్రులు ఉన్నారని, ముస్లింలకు మాత్రం చోటు కల్పించలేదని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రి అయిన ఆరునెలల్లో గురజాల నియోజకవర్గానికి సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.600 కోట్లు అక్రమంగా సంపాదించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంచేశారు. కార్యకర్తలను ఇబ్బందిపెడితే సహించం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందిపెడితే ఊరుకునేదిలేదని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు. టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా పాటిస్తున్న అధికారులను వదిలిపెట్ట బోమన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిపాలనా కావా లంటే జగన్‌ను సీఎంగా చేసుకోవాలని సూచించారు. నియోజకర్గంలో ఎమ్మెల్యే యరపతినేని ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏమీ ఇవ్వని యరపతి నేని ఇప్పుడు అక్రమంగా దోచుకున్న సంపాదనతో షష్టిపూర్తి, సీమంతాలు చేస్తూ ముక్కుపుడకలు, చీరలు, పంచెలు పంచడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో గనులు దోచుకోవడమే కాకుండా అన్నింటా కమీషన్లు వసూలు చేస్తూ వ్యాపారులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు జగన్‌కు ఓట్లు వేసి సీఎం చేయాలని కోరారు. ఇటీవల పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో ముస్లింలపై టీడీపీ అగ్రకుల నేతలు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురజాల ఎమ్మెల్యేగా మహేష్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలను హింసించే స్థానిక ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించి మంచికల్లుకు పంపించాలని పిలుపునిచ్చారు. కాసు కుటుంబం నుంచి వచ్చిన నేటితరం యువనాయకుడు మహేష్‌రెడ్డిని అఖండమెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలుత నగరి ఎమ్మెల్యే రోజ ప్రసంగించారు. ఈ సభలో యువనాయకుడు జంగా కోటయ్య, మాజీ సర్పంచ్ చింతపల్లి నన్నే, మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వట్టె రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు చింతపల్లి సైదా, ఎంపీటీసీ సభ్యులు పార్లగొర్ల కోటేశ్వరరావు, యడవల్లి మరియదాసు, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు శివయాదవ్, వెంకటరెడ్డి, రమేష్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి అనిల్‌కుమార్, అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, సేవాదళ్ మండల కన్వీనర్ షేక్ మహ్మద్‌జానీ, సొసైటీ డైరెక్టర్ గుర్రం వీరాంజనేయరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీ వెంటే నేనూ..
మాచవరం (రాయవరం): జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకుంటారు. జీవితంలోనే కాదు.. మరణంలోనూ మీ వెంటే నేనంటూ భర్త మరణాన్ని తట్టుకోలేక వారం రోజులకే భార్య కూడా మరణించిన ఘటన మండలంలోని మాచవరంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రొంగల సూర్యనారాయణ(83) ఈ నెల 12న మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. సరిగ్గా వారం రోజులకు సూర్యనారాయణ భార్య సత్యవతి(75) మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. భర్త సూర్యనారాయణతో అన్యోన్యంగా జీవించిన సత్యవతి ఆయన మరణానంతరం తీవ్రంగా కలత చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ దిగులుతోనే ఆమె ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్టుగా కుమారులు శ్రీనివాస్, సత్యప్రసాద్‌లు కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి మరణించిన వారానికే తల్లి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే సత్యవతి కళ్లను ఐ బ్యాంకుకు దానం చేసారు. కాకినాడ నుంచి వచ్చిన బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు చెందిన సాంకేతిక సిబ్బంది వచ్చి సత్యవతి కార్నియాను సేకరించి భద్రపర్చి తీసుకుని వెళ్లారు. -
బాలుడిని బలిగొన్న కారు
- మృతదేహంతో స్థానికుల రాస్తారోకో - ఆందోళనకారులకు అండగా వైఎస్సార్ సీపీ నేత బుర్రా - హైవే మేనేజ్మెంట్, సీఐ హామీతో ఆందోళన విరమణ -కనిగిరి మండలం మాచవరం వద్ద ఘటన.. కనిగిరి : వేగంగా వచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. న్యాయం చేయాలంటూ మృతుని బంధువులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో హైవేపై ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండలంలోని మాచవరం వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాలి నర్శింహులు మూడో కుమారుడు మధు (11) కంచర్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా పామూరు నుంచి కనిగిరి వైపు వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బాలుడు మధు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న సహచర విద్యార్థులు ఆ దృశ్యాన్ని చూసిన భయాందోళనకు గురై కేకలు పెట్టారు. స్థానికులు గమనించి ఘటన స్థలికి వచ్చేలోపే కారు ఆగకుండా వెళ్లిపోయింది. తల్లఢిల్లిన మాతృ హృదయం స్కూల్‌కు వెళ్లి వస్తానని చెప్పిన కుమారుడిని నిమిషాల వ్యవధిలో మృత్యు కబళించడంతో ఆ మాతృహృదయం తల్లఢిల్లింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు చిన్న వయసుల్లో అనంతలోకాలకు చేరడంతో తల్లి హజరతమ్మ కన్నీటిపర్యంతమైంది. స్కూల్ బస్సు ఎక్కేందుకు వచ్చిన తోటి విద్యార్థి కళ్లదుటే చనిపోవడంతో సహ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. బాలుడు మధు మృతితో కంచర్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలకు సెలవు ప్రకటించి ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. మృతదేహంతో రోడ్డెక్కిన ప్రజలు కళ్లముందే బాలుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువడికి చేర డంతో గ్రామస్తులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుకిరువైపులా కర్రలు, రాళ్లు పెట్టి వాహనాలు ఆపి బాలుడి మృతదేహంతో రాస్తారోకో చేశారు. హైవే అధికారుల తీరును దుయ్యబట్టారు. సీఐ సుధాకర్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకుని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు అండగా నిలిచారు. హైవే అధికారుల నిర్లక్ష్యాన్ని, పోలీసుల వైఖరిని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ నిలిచింది. హైవే అధికారులు వచ్చి తగు చర్యలు తీసుకునేంత వరకూ రోడ్డుపై నుంచి మృతదేహాన్ని తీయమంటూ బైఠాయించారు. కొద్ది సేపటి తర్వాత సీఐ.. హైవే అధికారులను పిలిపించి మాట్లాడారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆందోళనకారులు శాంతించలేదు. గతంలో కూడా ఇలానే చెప్పారని, కొత్తగా రోడ్డు వేశాక గ్రామస్తులు ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని ప్రజలు మండిపడ్డారు. కనీస ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేయలేదంటూ సీఐతో వాదనకు దిగారు. పోలీసులపై బుర్రా మండిపాటు పిల్లవాడిని పోగొట్టుకున్న బాధలో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని వైఎస్సార్ సీపీ నేత బుర్రా మధు ఖండించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, హైవే మేనేజŒ మెంట్ అథారిటీ అధికారులను సత్వరం పిలిపించాలని డిమాండ్ చేశారు. చేసేది లేక హైవే కనిగిరి ప్రాంత మేనేజర్ సింగ్‌ను పిలిపించారు. గ్రామాల్లో జీబ్రా లైటింగ్, సైట్ మార్కింగ్, ఇన్ సెట్ స్పీడ్ బ్రేకర్స్, లైన్ స్లో మార్కింగ్, విలేజ్ జోన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి మృతికి కారణమైన కారును రెండు రోజుల్లో పట్టుకుని చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను తాత్కలికంగా విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
విజయవాడలో సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
-
విజయవాడలో సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గుణదల : సాప్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మాచవరానికి చెందిన కొమ్మరి కృష్ణమూర్తి(33) సాప్ట్వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి వీరయ్య గుణదల కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. కృష్ణమూర్తికి ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన గీతతో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల తేజస్విని అనే పాప కూడా ఉంది. గత ఆదివారం సెలవు దినం కావడంతో ఆయన తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అయితే తల్లిదండ్రులు వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. తనకు విజయవాడలో పని ఉందని ముందు మీరు వెళ్లండని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఇంటి తాళాలు కృష్ణమూర్తికి అప్పగించి వెళ్లిపోయారు. ఉదయం నుంచి కృష్ణమూర్తి ఫోన్ తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. సాయంత్రం ఇంటి సమీపంలోని బంధువుకు ఫోన్ చేయడంతో ఆయన వెళ్లి చూడగా గేటుకు బయట తాళం వేసి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో తాళం తీసి పై అంతస్తులో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. కిటికీలోనుంచి చూడగా గదిలో ఉరికి వేలాడుతూ ఉన్న కృష్ణమూర్తిని చూసి కుటుంబసభ్యులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. సూసైడ్ నోట్ లభ్యం మృతుడు కృష్ణ మూర్తి వేసుకున్న టీ షర్టులో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. బిల్డర్ మహేష్ తమ తగ్గర నుంచి బలవంతంగా విలువైన ఆస్తిని తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నాడు. బిల్డర్ మహేష్ ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్బందులు లేవు ఆత్మహత్య చేసుకునేంత ఇబ్బందులు తమకు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా తమ పరిస్థితులు బాగానే ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలిసిపోయే కృష్ణమూర్తి ఆత్మహత్యకు బలమైన కారణం ఏమీ లేదని స్నేహితులు చెబుతున్నారు. కుటుంబ తగాదాలు కూడా లేవని స్థానికులు తెలిపారు. విషాదఛాయలు కృష్ణమూర్తి మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలాని కి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ ప్రాంతంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. పిడుగురాళ్ల, మాచవరంలలో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.