
సభకు హాజరైన ప్రజలు...ఇన్‌సెట్లో( ప్రసంగిస్తున్న రోజా, పక్కన కాసు మహేశ్ రెడ్డి)
పిన్నెల్లి (మాచవరం): దుర్మార్గపు టీడీపీ పాలన పతనం పిన్నెల్లి నుంచే ప్రారంభం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేబాట పాదయాత్ర ముగింపు సభ మాచవరం మండంలోని పిన్నెల్లి గ్రామంలో శని వారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైయినా.. ఆటంకాలు వచ్చినా.. చివరకు అక్రమంగా జైలులో పెట్టినా.. మన అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ధర్మ యుద్ధం చేస్తున్నారని, ఇది అంతంకాదని.. ఆరంభం మాత్రమేనని అన్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టించిన నాయకులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు అధికారం మారితే సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నారని.. తాము అధికారంలోకి వస్తే అటువంటి అధికారులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. టీడీపీ చేస్తున్న ప్రతి అక్రమాలు అన్నింటినీ గుర్తు పెట్టుకుంటున్నామని, తమ కార్యకర్తలపై పెట్టిన కేసులకు వడ్డీతో బదులు తీర్చుకుంటున్నామని స్పష్టంచేశారు.
మద్దతు ధర ఏది?
రైతులు పండించే పంటలకు టీడీపీ పాలనలో కనీస మద్దతు ధర లభించటంలేదని కాసు మహేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింల సంక్షేమానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషిని గుర్తుచేశారు. చంద్రబాబు క్యాబినెట్‌లో 26 మంది మంత్రులు ఉన్నారని, ముస్లింలకు మాత్రం చోటు కల్పించలేదని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రి అయిన ఆరునెలల్లో గురజాల నియోజకవర్గానికి సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.600 కోట్లు అక్రమంగా సంపాదించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంచేశారు.
కార్యకర్తలను ఇబ్బందిపెడితే సహించం
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందిపెడితే ఊరుకునేదిలేదని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు. టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా పాటిస్తున్న అధికారులను వదిలిపెట్ట బోమన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిపాలనా కావా లంటే జగన్‌ను సీఎంగా చేసుకోవాలని సూచించారు. నియోజకర్గంలో ఎమ్మెల్యే యరపతినేని ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏమీ ఇవ్వని యరపతి నేని ఇప్పుడు అక్రమంగా దోచుకున్న సంపాదనతో షష్టిపూర్తి, సీమంతాలు చేస్తూ ముక్కుపుడకలు, చీరలు, పంచెలు పంచడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు.
దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో గనులు దోచుకోవడమే కాకుండా అన్నింటా కమీషన్లు వసూలు చేస్తూ వ్యాపారులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు జగన్‌కు ఓట్లు వేసి సీఎం చేయాలని కోరారు. ఇటీవల పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో ముస్లింలపై టీడీపీ అగ్రకుల నేతలు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
గురజాల ఎమ్మెల్యేగా మహేష్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలను హింసించే స్థానిక ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించి మంచికల్లుకు పంపించాలని పిలుపునిచ్చారు. కాసు కుటుంబం నుంచి వచ్చిన నేటితరం యువనాయకుడు మహేష్‌రెడ్డిని అఖండమెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలుత నగరి ఎమ్మెల్యే రోజ ప్రసంగించారు.
ఈ సభలో యువనాయకుడు జంగా కోటయ్య, మాజీ సర్పంచ్ చింతపల్లి నన్నే, మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వట్టె రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు చింతపల్లి సైదా, ఎంపీటీసీ సభ్యులు పార్లగొర్ల కోటేశ్వరరావు, యడవల్లి మరియదాసు, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు శివయాదవ్, వెంకటరెడ్డి, రమేష్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి అనిల్‌కుమార్, అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, సేవాదళ్ మండల కన్వీనర్ షేక్ మహ్మద్‌జానీ, సొసైటీ డైరెక్టర్ గుర్రం వీరాంజనేయరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment