
మాచవరం (రాయవరం): జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకుంటారు. జీవితంలోనే కాదు.. మరణంలోనూ మీ వెంటే నేనంటూ భర్త మరణాన్ని తట్టుకోలేక వారం రోజులకే భార్య కూడా మరణించిన ఘటన మండలంలోని మాచవరంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు రొంగల సూర్యనారాయణ(83) ఈ నెల 12న మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. సరిగ్గా వారం రోజులకు సూర్యనారాయణ భార్య సత్యవతి(75) మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
భర్త సూర్యనారాయణతో అన్యోన్యంగా జీవించిన సత్యవతి ఆయన మరణానంతరం తీవ్రంగా కలత చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ దిగులుతోనే ఆమె ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్టుగా కుమారులు శ్రీనివాస్, సత్యప్రసాద్‌లు కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి మరణించిన వారానికే తల్లి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే సత్యవతి కళ్లను ఐ బ్యాంకుకు దానం చేసారు. కాకినాడ నుంచి వచ్చిన బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు చెందిన సాంకేతిక సిబ్బంది వచ్చి సత్యవతి కార్నియాను సేకరించి భద్రపర్చి తీసుకుని వెళ్లారు.