
తల్లితో కృష్ణమూర్తి (ఫైల్ ఫోటో)
గుణదల : సాప్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మాచవరానికి చెందిన కొమ్మరి కృష్ణమూర్తి(33) సాప్ట్వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి వీరయ్య గుణదల కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. కృష్ణమూర్తికి ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన గీతతో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల తేజస్విని అనే పాప కూడా ఉంది. గత ఆదివారం సెలవు దినం కావడంతో ఆయన తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు.
అయితే తల్లిదండ్రులు వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. తనకు విజయవాడలో పని ఉందని ముందు మీరు వెళ్లండని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఇంటి తాళాలు కృష్ణమూర్తికి అప్పగించి వెళ్లిపోయారు. ఉదయం నుంచి కృష్ణమూర్తి ఫోన్ తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. సాయంత్రం ఇంటి సమీపంలోని బంధువుకు ఫోన్ చేయడంతో ఆయన వెళ్లి చూడగా గేటుకు బయట తాళం వేసి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో తాళం తీసి పై అంతస్తులో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. కిటికీలోనుంచి చూడగా గదిలో ఉరికి వేలాడుతూ ఉన్న కృష్ణమూర్తిని చూసి కుటుంబసభ్యులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
సూసైడ్ నోట్ లభ్యం
మృతుడు కృష్ణ మూర్తి వేసుకున్న టీ షర్టులో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. బిల్డర్ మహేష్ తమ తగ్గర నుంచి బలవంతంగా విలువైన ఆస్తిని తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నాడు. బిల్డర్ మహేష్ ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇబ్బందులు లేవు
ఆత్మహత్య చేసుకునేంత ఇబ్బందులు తమకు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా తమ పరిస్థితులు బాగానే ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలిసిపోయే కృష్ణమూర్తి ఆత్మహత్యకు బలమైన కారణం ఏమీ లేదని స్నేహితులు చెబుతున్నారు. కుటుంబ తగాదాలు కూడా లేవని స్థానికులు తెలిపారు.
విషాదఛాయలు
కృష్ణమూర్తి మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలాని కి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ ప్రాంతంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.