తేజస్విని అవయవదానంపై జీవన్‌దాన్ సభ్యులతో మాట్లాడుతున్న సోదరుడు తేజ
లబ్బీపేట (విజయవాడ ఈస్ట్) : రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై బ్రెయిన్ డెత్‌కు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చిన్నాబత్తుల మైత్రీ తేజస్విని (26) అవయవాలను గురువారం సేకరించనున్నారు. ఏలూరు రోడ్డులో సోదరుడితో కలిసి మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ కటారి శ్రీనివాసరావు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన తేజస్వినిని తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి సమయంలో మెట్రో హాస్పటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెత్‌కు గురైనట్లు నిర్ధారించడంతో పాటు, సమాచారాన్ని జీవన్‌దాన్ ట్రస్టుకు అందజేశారు. కాగా జీవన్‌దాన్ ప్రతినిధులు బ్రెయిన్ డెత్‌కు గురైన తేజస్విని అవయవ దానం చేసేలా ఒప్పించేందుకు ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
చెన్నైలో ఉద్యోగం చేస్తూ సెలవుకు వచ్చిన తమ కుమార్తె షాపింగ్‌కు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా తమ కుమార్తెను బతికించుకుంటామని, మంచి వైద్యం అందించాలని డాక్టర్లను బతిమిలాడారు. వారి తాపత్రయానికి వైద్యులు సైతం ఏం చెప్పలేని స్థితిలో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో అవయవదానానికి వారు అంగీకరించేందుకు కొంత సమయం పట్టింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంధువులకు కౌన్సెలింగ్ ఇస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు తమ కుమార్తె ఈ లోకాన్ని వదిలివెళ్తున్నా మరో ఆరుగురిలో సజీవంగా ఉంటుందని గ్రహించి అవయవదానం చేసేందుకు వారు అంగీకరించారు. దీంతో తేజస్విని బ్లడ్ గ్రూప్‌కు సంబంధించిన అవయవాలు అవసరమైన వారి లిస్టులు జీవన్‌దాన్ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా గురువారం అవయవాలను సేకరించనున్నారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు...
గుణదల (విజయవాడ ఈస్ట్) : రోడ్డు ప్రమాదంలో తమ కుమార్తె తేజస్విని బ్రెయిన్ డెత్‌కు గురైందని తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లాలని చెప్పే పోలీసే మద్యం మత్తులో వాహనాన్ని నడిపి తమ కుమార్తె ప్రాణాలను బలి తీసుకున్నాడని విని హతాశులయ్యారు. కని పెంచిన కూతురు కళ్ల ముందే విగతజీవిగా మారటంతో ఆ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. మైత్రి తోబుట్టువులు రమ్య, రవితేజ ఈ ఘటనను జీర్ణించుకోలేక స్థబ్తతగా ఉండిపోయారు. ఇటీవలే కన్నతల్లి చనిపోయిన ఘటన మరువకముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. రక్త సంబంధీకులు, బంధువులు, సన్నిహితుల స్థానికులు సైతం వారిని ఓదార్చే ధైర్యం లేక నిలిచిపోయారు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ రేపో మాపో వివాహం చేసుకోవాల్సిన యువతి ఇలా విగతజీవిగా మారటంతో గుణదల ప్రాంతంలో విషాద ఛాయలు కమ్ముకున్నారు. మైత్రి తండ్రి రాయల్ స్థానికంగా ఉన్న బిషప్ గ్రాసి పాఠశాలలో పని చేస్తుంటాడు. పాతికేళ్లుగా తమతో కలిసి ఉన్న రాయల్ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకోవడంతో చుట్టుపక్కలవారు సైతం కుమిలిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment