
ప్రమాదానికి గురైన బస్సు
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన విజయవాడ బీఆర్‌టీఎస్ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (ఏఆర్ 02 5665) సోమవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. విజయవాడ ఏలూరు రోడ్డు నుంచి బీఆర్‌టీఎస్ రహదారిపైకి మలుపు తిరుగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం 20మంది గాయపడ్డారు. వీరిలో 14 మందిని ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అమరా దుర్గాప్రసాద్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదుచేశారు. బయల్దేరిన దగ్గర నుంచి డ్రైవర్ మితిమీరిన వేగంతోనే బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపించారు. నెమ్మదిగా వెళ్లమని పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దూకుడుగానే నడిపినట్లు వారు తెలిపారు.