orange travels
-
కాంగ్రెస్ గూటికి సునీల్ రెడ్డి, నర్సారెడ్డి
శాసనసభ ఎన్నికల కౌంట్‌డౌన్ నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలోనూ జోష్ రెట్టింపవుతోంది. ఇదిలా ఉండగా టిక్కెట్ల ఆశావహుల ప్రయత్నాలు సైతం ఊపందుకున్నాయి. నిజామాబాద్ నుంచి వయా హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వరకు నాయకులు చక్కర్లు కొడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వచ్చే నెల రెండోవారంలో రాష్ట్రంలో 50 నుంచి 55 వరకు అభ్యర్థులను మొదటి విడతగా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో నిజామాబాద్ అర్బన్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, బోధన్ నుంచి మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జుక్కల్ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం పేర్లు ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు పార్టీలో చేరికలు షురూ అయ్యాయి. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం ఖరారైంది. సునీల్‌రెడ్డి ఈ నెల 26న ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఓ హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే సునీల్‌రెడ్డి చేరిక ఖరారైంది. రేవంత్‌తో సమావేశం అనంతరం పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో సునీల్‌రెడ్డి సమావేశమయ్యారు. వారం రోజుల్లో సునీల్ పార్టీ కుండువా కప్పుకోనున్నారు. ఇందుకు ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివిధ సర్వేల నేపథ్యంలో సునీల్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో బీఎస్పీ తరుపున పోటీ చేసిన సునీల్‌రెడ్డికి 40 వేల పైగా ఓట్లు వచ్చాయి. అయితే బాల్కొండ నుంచి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సైతం టిక్కెట్టును ఆశిస్తుండడం గమనార్హం. ● మరోవైపు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పొంగులేటి బృందంతో కలిసి ఈ నెల 25న ఢిల్లీ వెళ్లారు. అక్కడే నర్సారెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నర్సారెడ్డికి మాత్రం టిక్కెట్టు విషయమై హామీ ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో రేవంత్‌రెడ్డితో కలిసి నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2018లో నర్సారెడ్డి చివరి నిముషం వరకు ఎమ్మె ల్యే టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. టిక్కెట్టు దక్కకపోవడంతో పార్టీ తరుపున ప్రచారానికి దూరంగా ఉన్నారు. శాసనసభ ఎన్నికలు అయ్యాక, పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు తాజాగా పొంగులేటి బృందంతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాగా కాంగ్రెస్‌లో చేరికకు ముందే గత మూడు నెలల నుంచే నర్సారెడ్డి నిజామాబాద్ రూరల్ టిక్కెట్టు కోసం రేవంత్‌రెడ్డిని అడుగుతున్నారు. ఈ క్రమంలో సునీల్ కనుగోలు బృందం సర్వేలో భూపతిరెడ్డి, కాట్పల్లి నగేష్‌రెడ్డి, తాహెర్‌బిన్ హందాన్లతో పాటు అరికెల నర్సారెడ్డి పేరును చేర్చా రు. అయితే విడతలవారీ సర్వేలో భూపతిరెడ్డికే అత్యధిక మంది మద్దతు ఉన్నట్లు తేలింది. నర్సారెడ్డి విషయంలో కేవలం మూడు శాతం మాత్రమే మొగ్గు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ టిక్కెట్టును భూపతిరెడ్డికే కేటాయించనున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ టిక్కెట్ల విషయంలో పార్టీ నాయకత్వం ఒక స్పష్టతకు రాకపోవడంతో ఉత్కంఠ కలిగిస్తోంది. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన విజయవాడ బీఆర్టీఎస్ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (ఏఆర్ 02 5665) సోమవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. విజయవాడ ఏలూరు రోడ్డు నుంచి బీఆర్టీఎస్ రహదారిపైకి మలుపు తిరుగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం 20మంది గాయపడ్డారు. వీరిలో 14 మందిని ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అమరా దుర్గాప్రసాద్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదుచేశారు. బయల్దేరిన దగ్గర నుంచి డ్రైవర్ మితిమీరిన వేగంతోనే బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపించారు. నెమ్మదిగా వెళ్లమని పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దూకుడుగానే నడిపినట్లు వారు తెలిపారు. -
అనుమతిలేని ట్రావెల్స్ సీజ్
నిర్మల్: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రావాణా శాఖాధికారులు పట్టుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టర్ అయి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఈ మూడు బస్సులు అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఈ బస్సులను ఆర్టీయే అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. -
‘అక్రమ బస్సులు నడపడంలో కేశినేని దిట్ట’
విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేనిపై పలు ట్రావెల్స్ యజమానుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని అక్రమ బస్సుల జాబితాను మీడియాకు విడుదల చేశారు. బస్సు నంబర్లతో సహా 27 బస్సుల జాబితా మీడియాకు విడుదల చేశారు. ఇన్నాళ్లుగా కేశినేని వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా చేశారంటూ ఆరంజ్, మార్నింగ్ స్టార్ యజమానులు సునీల్ రెడ్డి, నివాస్‌లు శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. కేశినేని ట్రావెల్స్ 27 ఓవవర్ హ్యాంగ్ బస్సులను నడిపిందని అన్నారు. అక్రమ బస్సులను నడపడంలో కేశినేని నానీ దిట్ట అని చెప్పారు. ఏపీలో రిజిస్ట్రయిన బస్సులు కూడా నిబంధనలకు విరుద్ధంగానే నడిచాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ట్రావెల్స్ బస్సు - కంటేనర్ ఢీ..ఒకరు మృతి
నల్లగొండ: వేగంగా వెళ్లాలనే ప్రయత్నంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న విశాఖకి చెందిన అవినాష్(30)అనే విద్యార్థి మృతి చెందగా మరో 10మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట శివారులోని సువెన్ ఫ్యాక్టరి సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రయాణికులతో విజయవాడ వెళ్తోంది. సువెన్ ఫ్యాక్టరి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళ్తున్న కంటేనర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మధ్య బస్సు కొనుగోలు వివాదం గురువారం తారాస్థాయికి చేరింది. దీంతో ఓ బస్సు ట్రావెల్స్ యజమానిని తుపాకీతో బెదిరించాడు. దీంతో మరో బస్సు ట్రావెల్స్ యజమాని అయిన బాధితుడు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బెదిరించిన ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... కూకట్‌పల్లిలోని ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డ్ వద్ద కృష్ణవేణి ట్రావెల్స్ యజమాని ప్రతాప్ రెడ్డి మూడు బస్సులు కొనుగోలు చేశాడు. మొత్తం నగదు చెల్లించేందుకు కొద్దిగా గడువు కావాలని ప్రతాప్ రెడ్డి కోరాడు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించాడు. గడువు ముగిసిన నగదు చెల్లించకపోవడంతో ప్రతాప్ రెడ్డి వైఖరిపై సునీల్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డిని గురువారం సునీల్ రెడ్డి తుపాకీతో బెదిరించారు. దీంతో తనకు ప్రాణ హాని ఉందని సునీల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.