అదుపుతప్పి బోల్తాకొట్టిన కారు.. మహిళ మృతి
అదుపుతప్పి బోల్తాకొట్టిన కారు.. మహిళ మృతి
Published Thu, Aug 18 2016 11:45 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
చింతపల్లి : హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి మరోసారి రక్తసిక్తమైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఒకే కుటుంబం వారు మారుతీ 800 కారులో పుష్కర స్నానాల కోసం సాగర్ వెళ్తుండగా హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండలం వింజమూరు దేవులాతండా సమీపంలో వారి కారు అదుపుతప్పి బోల్తా కొట్తింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృత్యువాత పడగా ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
సికింద్రాబాద్‌లోని త్రిపురానగర్ కాలనీకి చెందిన పర్శ లక్ష్మి (35), మహేశ్వర్ కుటుంబ సభ్యులైన తమ్ముడు నాగరాజు, నాగరాజు భార్య ప్రత్యశ్రీ, వారి పిల్లలు నిత్యశ్రీ, పూజ్యశ్రీ, యశ్వంత్‌లతో కలిసి కృష్ణా పుష్కరాలకు తమ సొంత వాహనమైన మారుతీ 800 కారులో గురువారం ఉదయం నాగార్జునసాగర్‌కు బయల్దేరారు. మండల పరిధిలోని వింజమూరు దేవులతండా సమీపంలోకి రాగానే కారు అతివేగంతో దూసుకొచ్చి కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తా కొట్టింది. దీంతో కారు నడుపుతున్న పర్శ లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న యశ్వంత్, నిత్యశ్రీలకు తీవ్ర గాయాలు కాగా నాగరాజు, నిత్యశ్రీ, ప్రత్యశ్రీలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో యశ్వంత్, నిత్యశ్రీల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి 108 ద్వారా తరలించగా లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపారు.
పండుగ పూట విషాదం..
హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయాలపాలు కాగా మరొకరు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాఖీ పండుగ సందర్భంగా కృష్ణా పుష్కరాలకు వెళ్తూ ప్రమాదానికి గురి కావడంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది.
Advertisement
Advertisement