కార్డులు.. చిక్కులు! | cards problems | Sakshi
Sakshi News home page

కార్డులు.. చిక్కులు!

Published Wed, Jan 11 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

కార్డులు.. చిక్కులు!

కార్డులు.. చిక్కులు!

రేషన్‌కార్డుల ఇన్‌ యాక్టివ్‌తో అవస్థలు
- యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
- సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలకు దూరం
- ఏడాదిగా కొందరి అవస్థలు వర్ణనాతీతం
- పింఛన్లు రద్దు కావడంతో అధికారుల కాళ్లావేళ్లా..
 
కర్నూలు(అగ్రికల్చర్‌): రేషన్‌ కార్డు లబ్ధిదారులను కొత్త సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కార్డులు ఇన్‌ యాక్టివ్‌ అవుతుండటంతో దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. వీటి సంఖ్య ఒకటి, రెండు కాదు.. వందలు, వేలల్లో ఉంటోంది. రేషన్‌ కార్డు యాక్టివ్‌లో ఉంటేనే సరుకులు అందుతాయి. పింఛన్లతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. కార్డు ఇన్‌ యాక్టివ్‌లో పడిపోతే ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉండదు. జీవనాధారం అయిన రేషన్‌ కార్డులు ఇన్‌యాక్టివ్‌లో పడి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా యాక్టివ్‌ చేయడానికి అధికారులకు మనసొప్పని పరిస్థితి. తహసీల్దారు, ఏఎస్‌ఓ ఆఫీసులు, జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. జిల్లాలో 10.76 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా.. నాలుగవ విడత జన్మభూమి సందర్భంగా జిల్లాకు కొత్తగా 87వేల రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. అయితే ఇటీవలి వరకు యాక్టివ్‌లో ఉన్న కార్డులు ఉన్నట్లుండి ఇన్‌ యాక్టివ్‌లోకి వెళ్తుండటం పట్ల లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
రేషన్‌ కార్డులు ఇన్‌ యాక్టివ్‌లోకి ఎందుకు వెళ్తాయంటే..
రేషన్‌ కార్డు నెంబర్‌తో కుటుంబ యజమానితో పాటు ఎంత మంది సభ్యులు ఉంటే అంత మంది ఆధార్‌ నెంబర్లు అనుసంధానం కావాల్సి ఉంది. ఆధార్‌ అనుసందానం కాకపోతే కార్డులు ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్తాయి. ఒక మండలానికి చెందిన ఆధార్‌ కార్డులు మరో మండలానికి చెందిన కార్డులతో లింకప్‌ అయ్యాయి. జిల్లాకు చెందిన వందలాది మంది ఆధార్‌ నెంబర్లు అనంతపురం జిల్లాలోని కార్డులతో అనుసందానమయ్యాయి. ఇలాంటివన్నీ చెల్లని కార్డులుగా మారాయి. ఆధార్‌ నెంబర్లు తప్పుగా ఉన్నప్పుడు వేలి ముద్రలు సరిపోవు. అలాంటప్పుడు కూడా కార్డులు పనిచేయవు. రేషన్‌ కార్డుతో ఆధార్‌ నెంబర్లు, సెల్‌ఫోన్‌ నెంబరు కూడా అనుసంధానం కావాల్సి ఉంది. ఇలా అనేక కారణాల వల్ల రేషన్‌ కార్డులు పనిచేయకుండా పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అన్నీ సక్రమంగా ఉన్నా కార్డులు ఇన్‌ యాక్టివ్‌ అవుతున్నాయి. ప్రతి నెల ఇన్‌ యాక్టివ్‌లోకి వెళ్లె కార్డులు 500 నుంచి 1000 వరకు ఉంటున్నాయి.
 
యాక్టివ్‌లోకి తెచ్చుకోవాలంటే..
పనిచేయని రేషన్‌ కార్డులను తిరిగి పనిచేసేలా చేసుకోవాలంటే కార్డుదారులకు తల ప్రాణం తోకకు వస్తోంది. జిల్లా వాసుల ఆధార్‌ నెంబర్లు అనంతపురం జిల్లా రేషన్‌ కార్డులతో అనుసంధానం అయినవి అనేకం ఉన్నాయి. అక్కడ తొలగించుకోలేకపోతే ఇక్కడ కార్డు లేదా సభ్యుడు యాక్టివ్‌లోకి వచ్చే అవకాశం లేదు. కొందరు అనంతపురం వెళ్లి అక్కడి రేషన్‌ కార్డులో పేరు తీసివేయించుకొని ఇక్కడికి వచ్చి పేరు యాక్టివ్‌లోకి తెచ్చుకుంటున్నారు. అక్కడ తొలగిస్తేనే ఇక్కడ మళ్లీ రేషన్‌ కార్డులో సభ్యులుగా చేరేందుకు అవకాశం ఉంది. ఆధార్‌ అనుసంధానం అయి ఉన్నప్పటికీ కార్డు ఇన్‌ యాక్టివ్‌లోకి వెళితే సంబంధిత తహసీల్దారు లేదా ఏఎస్‌ఓలు యాక్టివ్‌లోకి తీసుకొచ్చేందుకు జేసీకి లెటర్‌ రాయాల్సి ఉంది. అన్నీ సక్రమంగా ఉంటే జాయింట్‌ కలెక్టర్‌ ఇన్‌ యాక్టివ్‌ కార్డులను యాక్టివ్‌లోకి తెస్తారు.
 
చెప్పులు అరగాల్సిందే..
ఇన్‌ యాక్టివ్‌లో ఉన్న రేషన్‌ కార్డులను యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు ఆరు నెలలు, ఏడాదిగా కొందరు లబ్ధిదారులు తహసీల్దార్‌, ఏఎస్‌ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. అన్నీ సక్రమంగా ఉంటే కేవలం రెండు, మూడు రోజుల్లో అయ్యే పనిని సైతం నెలలు పాటు కాలయాపన చేస్తుండటం కార్డుదారుల అవస్థలకు అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement