టీటీడీ చైర్మన్పై పోలీసు కేసు నమోదు
పుత్తూరు : నిండ్రలోని ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను బెదిరించారనే ఆరోపణతో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. చదలవాడ కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి తన అనుచరులతో కలసి ఫ్యాక్టరీలోకి ప్రవేశించారు. అక్కడ విధుల్లో ఉన్న కార్మికులను బయటకు వెళ్లాలని ఆగ్రహించా రు. విశ్రాంతి భవనం వద్దకు వెళ్లి ఫ్యాక్టరీకి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ ఏజెన్సీ చైర్మన్ నందకుమార్‌పై దురుసుగా ప్రవర్తించారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసినట్టు నిండ్ర ఎస్‌ఐ బాలకృష్ణయ్య తెలిపారు.
నేను దౌర్జన్యానికి పాల్పడలేదు : చదలవాడ
ఈ సంఘటనపై చదలవాడ కృష్ణమూర్తిని సాక్షి ప్రతినిధి వివరణ కోరగా ‘‘నేను గానీ, నా అనుచరులు గానీ ఎటువంటి దౌర్జన్యానికీ పాల్పడలేదు. ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీలో నేనూ షేర్ హోల్డర్‌ను. ఫ్యాక్టరీ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఎవరూ పనులు చేయకూడదు. రాత్రి 7.30 సమయంలో పనులు చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లాను. నాతో పాటు రైతులకు కూడా అన్యాయం జరుగుతోందనీ, ఇంతకీ ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఫ్యాక్టరీలోకి వెళ్లాను. దీనిపై ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగాను’’ అని తెలిపారు.