- భైంసాలో బాధితుల ఆందోళన
- పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
బంపర్ ఆఫర్ పేరిట మోసం
Published Sat, Jul 30 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
భైంసా : శ్రీవరలక్ష్మీ మార్కెటింగ్ పేరిట రంగుల బ్రోచర్లను ముద్రించి బంపర్ ఆఫర్ అంటూ ఆశ చూపి నిరక్షరాస్యులను, గ్రామీణ ప్రాంత వాసులను నిలువుగా ముంచేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సదరు దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులను ఆశ్రయించారు. భైంసా పట్టణ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఇదీ జరిగింది...
భైంసా డివిజన్‌లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో, పట్టణంలోని పలు కాలనీల్లో గుర్తుతెలియని కొంతమంది శ్రీవరలక్ష్మీ మార్కెటింగ్ బంపర్ ఆఫర్ టికెట్‌లను విక్రయించారు. ఒక్కో టికెట్ రూ.2వేలకు అమ్మారు. కార్డు తీసుకుని కస్టమర్లు డబ్బులు ఇవ్వగానే వారికి అదే రోజు స్క్రాచ్ కార్డులను కూడా అందించారు. బ్రోచర్‌లో వాషింగ్‌మిషన్, 21 ఇంచుల ఎల్‌సీడీ టీవీ, 10 గ్రాముల బంగారం, ల్యాప్‌టాప్, రిఫ్రిజిరేటర్, డీవీడీ ప్లేయర్, హోంథియేటర్, 10 లీటర్ల ప్రెషర్ కుక్కర్, స్టాండింగ్ ఫ్యాన్, ఇండక్షన్ స్టౌ, రైస్‌కుక్కర్, మిక్సర్‌గ్రైండర్ లక్కీగా ఇస్తామని చెప్పారు. ఈ నెల 30న భైంసాలో లక్కీ స్కీం ఉంటుందని ప్రకటించారు. కార్డులు కొనుగోలు చేసిన బాధితులంతా శనివారం భైంసా చేరుకున్నారు. సదరు దుకాణం ముందుకు చేరుకోగానే కార్డులు అందించిన వారంతా పత్తాలేకుండా పోయారని తెలుసుకున్నారు. తాము మోసపోయామంటూ కొనుగోలుచేసిన కార్డులు, టికెట్లు చేతపట్టుకుని భైంసా–నిర్మల్ 61వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు 60 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎక్కువగానే ముంచారు
వరలక్ష్మీ బంపర్ స్కీం పేరిట గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలోనే కార్డులు విక్రయించినట్లు తెలుస్తోంది. నిర్మల్ డివిజన్ అంతా ఈ కార్డులు విక్రయించినట్లు సమాచారం. వందల సంఖ్యల్లోనే కార్డులన్నీ లక్షల రూపాయలతో ఉడాయించిన ఈ ముఠాపై దష్టిసారించాల్సిన అవసరం ఉంది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బాధితుల సంఖ్య తేలనుంది.
ఇలాంటివాటిని నమ్మవద్దు : మహేందర్, పట్టణ ఎస్సై
లక్కీ స్కీం, బంపర్ ఆఫర్‌లపేరిట గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. ఇలాంటి వారి ఆచూకీ తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ఇలాంటి వ్యాపారం చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
Advertisement
Advertisement