ఆ ముగ్గురిపై కేసులు పెడతాం: నెహ్రూ
మధురానగర్ (విజయవాడ): ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుపై కేసులు పెడతామని పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ అన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో వీరిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ అవినీతి పాలన సాగిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యులకు స్థానం లేకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 'ఓటుకు కోట్లు కేసు టేపుల్లో స్వరం మీదా కాదా?' అని శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నించగా.. ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనన్న భయంతో సీఎం చంద్రబాబు సభకు డుమ్మా కొట్టారని విమర్శించారు.