నగదు రహిత కష్టాలు
Published Fri, Feb 10 2017 2:31 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత విధానం ఇటు కార్డుదారులు.. అటు రేషన్ డీలర్లకు చుక్కలు చూపిస్తోంది. గోపాలపురం మండలం పెద్దగూడెంలో ప్రజలు ఈ పోస్ యం త్రాలను ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. జిల్లాలో పలుచోట్ల రేషన్ డిపోల ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. పూర్తిస్థాయి కసరత్తు లేకుండా హడావుడిగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డుదారులందరికీ విధిగా బ్యాంక్ అకౌంట్లు ఉండాలనే నిబంధన విధించారు. గతంలోరేషన్ కార్డులో పేరు నమోదైన అందరి వ్యక్తుల వేలి ముద్రలు స్వీకరించారు. వారిలో ఎవరు రేష¯ŒS షాపునకు వెళ్లినా నిత్యావసర సరుకులు ఇచ్చేవారు. ఈ నెల నుంచి ఆన్‌లైన్ చెల్లింపు రావడంతో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయ్యింది. దీంతో కార్డులో పేరు నమోదైన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందేనని డీలర్లు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరికి బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోదని, నిత్యావసర సరుకుల కోసం ఎవరైతే వస్తారో వారి పేరిట కచ్చితంగా అకౌంట్ ఉండాలని, ఆ అకౌంట్ నుంచే నగదు బదిలీ అవుతుందని చెబుతున్నారు. అకౌంట్‌లో కనీసం రూ.500 నగదు నిల్వ ఉండాలని, లేకపోతే చార్జీలు చెల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అంత సొమ్మును బ్యాంక్ అకౌంట్‌లో నిల్వ ఉంచే పరిస్థితి పేదలకు ఉండదు. కొందరికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నా సరుకులు తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు వెళ్లేముందు బ్యాంక్‌కు వెళ్లి సొమ్ము జమ చేయాల్సి వస్తోంది. ఆ తరువాత సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. కొందరి ఖాతాల్లో సొమ్ములున్నా సాంకేతిక సమస్య కారణంగా సరుకులు తీసుకోలేని దుస్థితి దాపురిస్తోంది. కొన్నిచోట్ల కార్డుదారుల ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగినా డీలర్ ఖాతాలో జమ కావడం లేదు. దీంతో కార్డుదారులు నగదు కోల్పోవడమేకాక, సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు.
యంత్రాల సమస్య
జిల్లాలోని రేషన్ దుకాణాల్లో విజన్‌టెక్, ఎనలాజిక్ ఈ పోస్ యంత్రాలు ఉన్నాయి. విజన్‌టెక్ యం త్రాల్లో 25 నుంచి 30 శాతం నగదు రహిత విధానంలో పనిచేస్తున్నాయి. ఎనలాజిక్ యంత్రాలను గత నెల 31న ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. కనీసం డీలర్లకు శిక్షణ ఇవ్వకుండా ఈ నెల 1 నుంచి నగదు రహిత విధానాన్ని అమల్లోకి తెచ్చారు. చాలాచోట్ల యంత్రాలు ఆన్‌లైన్‌తో అనుసంధానం కాలేదు. అందరూ ఒకేసారి ఈ యంత్రాలను అనుసంధానం చేయడంతో సర్వర్లు బిజీగా మారిపోయాయి. ఆచంట, భీమవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలకు డీలర్లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఏపీపీడీఎస్ సర్వర్, ఆధార్ సర్వర్, బ్యాంకింగ్ సర్వర్ ఏకకాలంలో పనిచేయడంతోపాటు లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో తగినంత సొమ్ము నిల్వ ఉంటేనే సరుకులు ఇవ్వడానికి వీలవుతోంది. ఏ సర్వర్ పని చేయకపోయినా, పదేపదే ప్రయత్నం చేయాల్సి వస్తోంది. మరోవైపు లబ్ధిదారులు తమ ఖాతాల్లో కనీస నగదు జమ చేసేందుకు, ఆధార్ అనుసంధానం చేసేందుకు పనులు మానుకుని బ్యాంకుల ఎదుట నిలబడుతున్నారు. డిసెంబర్ నెలలో సరుకులు అప్పుగా ఇచ్చారు. జనవరి నెలలో డీలర్లు రెండు నెలల డబ్బులు వసూలు చేశారు. డిసెంబర్‌లో తీసుకెళ్లిన సరుకులకు సొమ్ము చెల్లించలేనట్టు ఈ–పోస్ యంత్రాలు చూపిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతా నుంచి రెండు నెలల సొమ్ము డీలర్‌కు బదిలీ అవుతోంది.
డీలర్ల ఆందోళన
నగదు రహితం పేరుతో యూజర్ చార్జీలు వసూలు చేస్తుండటంతో డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక డీలర్ 400 కార్డులపై నగదు రహిత విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తే కార్డుకు రూ.3 చొప్పున రూ.1,200 యూజర్ చార్జీలు డీలర్ ఖాతా నుంచి కట్ అవుతున్నాయి. కొందరు కార్డుదారుల ఖాతాల నుంచి బదిలీ అయిన సొమ్ములు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఈ సొమ్ములు బ్యాంకుల్లోని సస్పెన్స్ అకౌంట్లలోకి చేరుతున్నాయి. దీంతో డీలర్లు ఆ సొమ్మును తమ ఖాతాలోకి మార్పించుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నగదు రహితం పూర్తిస్థాయిలో చేశామని చెప్పుకోవడానికి జిల్లా ఉన్నతాధికారులు తీసుకువస్తున్న ఒత్తిడి కారణంగా కార్డుదారులు, డీలర్లు నలిగిపోతున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు తమకు శాపంగా మారుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన తర్వాతే నగదు రహిత లావాదేవీలు చేయాలని.. లేనిపక్షంలో వచ్చే నెలలో షాపులు మూసివేసి నిరసన తెలుపుతామని డీలర్ల అసోసియేషన్ నేత గంగాధర్ ‘సాక్షి’కి తెలిపారు.
Advertisement