నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా..
నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా..
Published Mon, Nov 28 2016 11:35 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
విద్యార్థులకు అవగాహన కల్పించనున్న విద్యాశాఖ
ఈ బాధ్యతను ఎంఈఓలకు అప్పగిస్తూ ఎస్‌ఎస్‌ఏ పీవో ఆదేశాలు
రాయవరం : నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు నగదు రహిత లావాదేవీలో మేలనే రీతిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఈ బాధ్యతను ఎంఈఓలకు అప్పగిస్తూ ఎస్‌ఎస్‌ఏ పీవో ఎం.శేషగిరి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల ప్రకారం జిల్లాలోని అన్ని మండల విద్యాశాకాధికారి కార్యాలయాలకు సోమవారం పీవో ఈ మేరకు ఉత్తర్వులు పంపారు.
ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా నిర్వహించాలి అనే విషయమై అవగాహన కల్పించి, వారి ద్వారా తల్లిదండ్రులకు గ్రామస్తులకు నగదు రహిత లావాదేవీల విషయంలో చైతన్యపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, ఎస్‌ఎంఎస్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకిగ్ ఏ విధంగా చేయాలి? స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించే పద్ధతులను విద్యార్థులకు తెలియజేసి వారి ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. నగదురహిత లావాదేవీలను పెంచితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఆయన తెలిపారు. అందరు ప్రధానోపాధ్యాయులు/స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు/ఎంఈవో/కేజీబీవీ అధికారులు నగదు లావాదేవీలు కాకుండా, అన్ని చెల్లింపులు కేవలం అకౌంట్ పేయి చెక్‌ల ద్వారా చెల్లించవలసినదిగా ఆదేశించడమైనది.
Advertisement
Advertisement