మళ్లీ నగదు కష్టాలు
⇒బ్యాంకుల్లో నగదు కొరత
⇒విత్‌డ్రాలపై పరిమితి
⇒ఆర్బీఐ నుంచి వచ్చే నిధుల్లో కోత
⇒ మందగించిన లావాదేవీలు
⇒మూతపడిన ఏటీఎం కేంద్రాలు
జిల్లాలో మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. గతేడాది చివరిలో పెద్ద నోట్ల రద్దు తర్వాత జనం చాలా యాతన పడ్డారు. జనవరి తర్వాత క్రమేపీ నగదు నిల్వలు పెంచడంతో అవస్థలు తప్పాయి. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. కానీ మార్చి చివరి వారంలో తిరిగి నోట్ల కొరత ఎదురయింది. ఏ ఏటీఎంకు వెళ్లినా నగదు ఉండటం లేదు. బ్యాంకులకు వెళ్లి క్యూలో నిల్చుంటే విత్‌డ్రాపై పరిమితి విధించడం నిరాశకు గురిచేస్తోంది. జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్బీఐ నుంచి నిధులు రాకపోవడమే దీనికి కారణమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
తిరుపతి (అలిపిరి) : బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. తాజాగా విత్‌డ్రాలపై పరిమితి విధిస్తున్నాయి. జిల్లా అవసరాలకు వారానికి రూ.300 కోట్లు అవసరం. కానీ రిజర్వుబ్యాంకు నుంచి రూ.75 కోట్ల నుంచి రూ.125 కోట్లు మాత్రమే వస్తోందని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలలుగా జాతీయ బ్యాంకు శాఖల లావాదేవీలు మందగించాయి. జిల్లా వ్యాప్తంగా 40 జాతీయ బ్యాంకులకు చెందిన 595 బ్యాంకు శాఖలు వున్నాయి. నగదు రహిత లావాదేవీలంటూ ఆర్బీఐ కోత విధించడంతో ఎస్బీఐ కూడా విత్‌డ్రాలపై పరిమితి విధించింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకర్లు లావాదేవీలు కొనసాగించలేక తల పట్టుకుంటున్నారు. డిపాజిట్లపై ఆధారపడి బ్యాంకు శాఖలు ఏరోజుకారోజు లావాదేవీలు కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నగదు లేక కొద్ది రోజులుగా ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి.
ఒకటో తారీఖు మొదటి వారంలో..
ప్రతి నెల ఒకటో తారీఖు, మొదటి వారంలో బ్యాంకులకు భారీగా నగదు అవసరమవుతుంది. 38వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రూ.400 కోట్లు, 26వేల మంది విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.250 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 3,90,720 మందికి రూ.47 కోట్లు అవసరం. సామాన్య ఖాతాదారుల లావాదేవీల కోసం మరో రూ.300 కోట్లు అవసరం. అంటే జిల్లా అవసరాలకు వెయ్యి కోట్ల మేర నగదు అవసరం. గడచిన నెలలో ఆర్బీఐ నుంచి రూ.125 కోట్లు మాత్రమే చేరింది. ఈనెల మొదటి వారం ముగుస్తున్నా ఇంత వరకు జిల్లాకు చిల్లిగవ్వకూడా రాలేదు. దీంతో జాతీయ బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. గురువారం ఎస్బీఐ పలు శాఖల్లో నగదు విత్‌డ్రా పరిమితిని రూ.5వేలకు కుదించారు.
ఏటీఎంలలో నో క్యాష్
జిల్లాలోని 709 ఏటీఎం కేంద్రాల్లో 10 శాతం కూడా పనిచేయడం లేదు. జిల్లాకు చేరుతున్న అరకొర నగదు బ్యాంకు లావాదేవీలకే సరిపోవడం లేదు. బ్యాంకర్లు ఏటీఎంల నిర్వహణ జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ఏటీఎం కేంద్రాలు మూతబడి ఉన్నాయి. అత్యవసరాలకూ చేతికి సొమ్ము రాకపోవడంతో జనం ఆందోళనచెందుతున్నారు. డబ్బులు ఎకౌంటులో ఉన్నా అప్పు తెచ్చానని పద్మావతీపురానికి చెందిన రామారావు వాపోయాడు. ఆర్బీఐ నుంచి అధిక మొత్తంలో నగదు అందే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది.