క్యాష్‌లెస్ ట్రాన్సాక‌్షన్స్ నిర్వహించండి
-
బ్యాంక్ కరస్పాండెంట్లుగా రేషన్ డీలర్లు
-
బ్యాంకుల వద్ద క్యూలను తగ్గించండి
-
కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితరాలను క్యాష్‌లెస్ ట్రాన్సాక‌్షన్స్ చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో వివిధ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిందన్నారు. ఈ ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వ్యాపార సంస్థ వద్ద, కూరగాయల మార్కెట్ వద్ద స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ టికెట్లు రద్దు చేసేలా ఉన్నతాధికారులతో చర్చించాలన్నారు. బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూఽలో ఉండకుండా ప్రత్యామ్నాయమార్గాలు చూపాలని సూచించారు. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి రూపే కార్డులు పంపిణీ చేయాలన్నారు. దేవాలయాల్లో ఏర్పాటు చేసిన హుండీల్లో నగదు లెక్కించి బ్యాంకుల్లో జమ చేయాలని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా విత్తనాలు, ఎరువులు పాత నోట్లతో సరఫరా చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ మాట్లాడుతూ చౌకదుకాణాల డీలర్లను బ్యాంక్ కరస్పాండెంట్లుగా(బీసీ) ప్రభుత్వం నియమించిందన్నారు. చౌకదుకాణాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
24 వరకు పాత నోట్లతో ఎరువులు, విత్తనాలు
ఈ నెల 24వ తేదీ వరకు పాత నోట్లతో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని జేసీ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు పాత కరెన్సీ నోట్లను తీసుకుంటారని తెలిపారు. సమావేశంలో జేసీ 2 రాజ్‌కుమార్, ఏఎస్పీ శరత్‌బాబు, ఎల్‌డీఎం వెంకట్రావు పాల్గొన్నారు.