సీసీఐ కొనుగోళ్లపై సీబీఐ విచారణ..
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌లో సీసీఐ కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ రెండో దశ విచారణ మొదలు పెట్టింది. 2004 నుంచి 2008 వరకు ఈ మార్కెట్‌లో సీసీఐ చేపట్టిన పత్తి కొనుగోళ్లపై హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే మొదటి దశ విచారణ పూర్తి చేసిందే. తాజాగా 2009 నుంచి 2015 వరకు జరిగిన అక్రమాలపై బుధవారం సాయంత్రం సీబీఐ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ అధ్వర్యంలో ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు సీతారామారావు, రాఘవేంద్రతోపాటు సీసీఐ వరంగల్ బ్రాంచ్ విజిలెన్స్ డిప్యూటీ మేనేజర్ సంజయ్ జమ్మికుంటలో విచారణ చేపట్టారు. పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్, గాయత్రీ బ్యాంక్, ఎస్‌బీహెచ్ బ్యాంకుల్లోని రైతుల అకౌంట్లను పరి శీలించారు. దీనిపై ‘సాక్షి’ వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా, పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అయితే, సీసీఐ కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేస్తున్నామని, తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమని సీబీఐ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.
ఏడేళ్ల కొనుగోళ్లపై సీబీఐ విచారణ
కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని రైతులు సీసీఐకి పత్తిని విక్రయించగా కొనుగోళ్లల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐకి ఫిర్యాదులు అందారుు. ఏడేళ్లల్లో సీసీఐకి పత్తి విక్రయించిన రైతుల జాబితా ఆధారంగా విచారణ చేపడుతున్నారు. సీసీఐకి పత్తిని అమ్మిన రైతులపై అనుమానాలు కలుగ డంతో బ్యాంక్‌ల్లో అకౌంట్లను పరిశీలిస్తున్నారు. బినామీ రైతుల పేరిట అక్రమాలకు పాల్పడిన అడ్తిదారుల చిట్టా సీబీఐ వద్ద ఉన్నట్లు తెలిసింది.
జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల రైతులతోపాటు వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల రైతులను బుధవారం జమ్మికుంట బ్యాంక్‌లో నేరుగా సీబీఐ డీఎస్పీ విచారణ జరిపారు. రైతుల ఆధారుకార్డు, పట్టా పాసుబుక్కులు, బ్యాంక్ ఖాతాలను తనిఖీలు చేశారు. రైతుల పేరుతో సీసీఐకి పత్తిని అమ్మిన వ్యాపారులు ఆ రైతుల పేరిట బ్యాంక్‌ల్లో ఖాతాలు ప్రారంభిం చి ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకున్న ట్లు సీబీఐ గుర్తించినట్లు సమాచారం.