ప్రభుత్వాసుపత్రుల్లో నిఘా నేత్రం
ప్రభుత్వాసుపత్రుల్లో నిఘా నేత్రం
Published Fri, Oct 14 2016 10:47 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– జిల్లాలో 18 ఆసుపత్రులు ఎంపిక
– 16 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి
– కలెక్టరేట్, డీసీహెచ్‌ఎస్ కార్యాలయాలకు అనుసంధానం
జంగారెడ్డిగూడెం : జిల్లాలోని అన్ని ప్రధాన ఆసుపత్రులు నిఘా నేత్రం పరిధిలోకి చేరాయి. 18 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటికి 16 ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ జిల్లా కలెక్టర్ కార్యాలయం, డీసీహెచ్‌ఎస్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీంతో ఆయా ఆసుపత్రుల్లో జరుగుతున్న కార్యక్రమాలను కలెక్టర్ కె.భాస్కర్, డీసీహెచ్‌ఎస్ కె.శంకర్రావు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. జిల్లా కేంద్ర ఆసుపత్రి, మూడు ఏరియా ఆసుపత్రులు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
శిశువుల అపహరణ నేపథ్యంలో..
ఇటీవల రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో శిశువులు మారిపోవడం, అపహరణకు గురికావడం తదితర ఘటనల నేపథ్యంలో ప్రధాన ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కువగా కాన్పులు జరిగే ఆసుపత్రుల్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్లు వచ్చిందీ, లేనిదీ, సిబ్బంది పనిచేస్తున్నారా? లేదా? అనే విషయాలతో పాటు పారిశుధ్యం, ఏదైనా ఘటనలు జరిగినప్పుడు జరిగే ఆందోళనలు, ధర్నాలు, వీటి కారణంగా ఆసుపత్రికి జరిగే నష్టం, ఘటనకు సంబంధించి వైద్యులు, సిబ్బంది పనితీరును కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో జరిగే దొంగతనాలను కూడా కనిపెట్టవచ్చు. ఈ ఆసుపత్రుల్లో జరిగే కార్యకలాపాలు, వైద్యసేవలన్నీ నేరుగా కలెక్టర్, డీసీహెచ్‌ఎస్ చూడవచ్చు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 24 కెమెరాలు, ఏరియా ఆసుపత్రుల్లో 8 కెమెరాలు, కమ్యూనిటీ ఆసుపత్రుల్లో 6 కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటునకు సంబంధించి నిధులు ఆయా ఆసుపత్రుల అభివద్ధి నిధుల నుంచి వెచ్చించారు.
ఆసుపత్రులు ఇవే..
ఏలూరు జిల్లా ఆసుపత్రితో పాటు జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. వీటితో పాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, చింతలపూడి, పెనుగొండ, ఆచంట, పోలవరం, దెందులూరు, భీమడోలు, ఆకివీడు, గోపాలపురం కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో కెమెరాల ఏర్పాటు పూర్తయ్యింది. నిడదవోలు, బుట్టాయగూడెంలలో నూతన ఆసుపత్రి భవనాలు నిర్మాణంలో ఉన్నందున వచ్చే నెల నాటికి వీటిలో ఏర్పాటు చేయనున్నారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద, ఓపీ హాలు, క్యాజువాలిటీ హాలు, మందుల పంపిణీ, ప్రసూతి వార్డు తదితర ప్రధాన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
ఏం జరిగినా తెలుసుకోవచ్చు
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ఏ ఘటన జరిగినా తెలుసుకోవచ్చు. డాక్టర్లు, సిబ్బంది వచ్చి పనిచేస్తున్నారా లేదా, ఓపీ ఎలా ఉందో మాకు వెంటనే తెలిసిపోతుంది. శిశు మార్పిడులు, అపహరణలు, దొంగతనాల కేసులను వెంటనే చేధించవచ్చు.
– కె.శంకరరావు, డీసీహెచ్‌ఎస్ , ఏలూరు
Advertisement