తిరుపతి: సుదూర ప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో సీసీకెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే బోర్డు మెంబర్ (రైల్వే పోలీస్- హెల్త్ అండ్ శానిటేషన్ విభాగాలు) ప్రదీప్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన తిరుపతి రైల్వేస్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. రైళ్లలో తరచూ జరుగుతున్న చోరీలు, ఇతర సంఘటనల నేపథ్యంలో ప్రయోగాత్మకంగా కొన్ని సుదూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేసి పరిశీలిస్తామన్నారు.
తర్వాత ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధ్యయనం చేసి దేశ వ్యాప్తంగా ముఖ్యమైన రైళ్లలో ఈ నిఘా వ్యవస్థను పెంచుతామన్నారు. రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైల్వే పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా ఆర్పీఎఫ్ పోలీసులతో నిఘా పెంచామని తెలిపారు. రైల్వే ఉద్యోగులు, ప్రయాణీకుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఆరోగ్య విభాగాన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. అందుకు 160 మంది స్పెషల్ డాక్టర్లను రైల్వే బోర్డు ద్వారా నియమించాల్సి ఉందన్నారు. తిరుపతిలో అవసరాన్ని బట్టి రైల్వే హాస్పిటల్ ఏర్పాటుకు అన్నిచర్యలు పరిశీలిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది రైల్వే భద్రతా దళాల ద్వారా దేశంలోని 8వేల రైల్వేస్టేషన్‌లలో 7,500 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చామని వివరించారు. ఇప్పటివరకు ఆర్పీఎఫ్ విభాగం ద్వారా చేపడుతున్న భద్రతా చర్యలు, పనితీరుకు గుర్తింపుగా కేంద్ర హోంశాఖామంత్రి నుంచి ఉత్తమ అవార్డులు వచ్చాయని చెప్పారు. సమావేశంలో చీఫ్ రైల్వే పర్సనల్ ఆఫీసర్ ఎన్‌వి.రమణారెడ్డి, సీనియర్ లైజన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ, గుంతకల్ సీనియర్ డీసీఎం రాఖేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
'దూరప్రాంత రైళ్లలో సీసీ కెమెరాలు'
Published Sat, Oct 15 2016 8:05 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement