సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్టు
సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్టు
Published Fri, Jan 27 2017 12:24 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
కర్నూలు నగరంలో ఆటోల్లో తిరుగుతూ సెల్‌ఫోన్లు, నగదు దొంగతనాలకు పాల్పడే ఏడుగురు పాత నేరస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. వారి వద్ద నుంచి ఆటో, 38 సెల్‌ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గురువారం వ్యాస్ ఆడిటోరియంలో ఆయన నిందితుల వివరాలను మీడియాకు తెలిపారు. పందిపాడుకు చెందిన సయ్యద్ షేక్షావలి(32), షేక్‌షావలి(20), షేక్‌వలిబాషా(39), కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఎంతేజ(20), ముజాఫర్‌నగర్‌కు చెందిన షేక్ షేక్షావలి(20), ప్రకాష్‌నగర్‌కు చెందిన అక్బర్‌బాషా అలియాస్ బిల్లి, కర్నూలు పెద్ద మార్కెట్‌కు చెందిన షేక్ మదార్ షా(47) నగరంలోని ముజాఫర్‌నగర్ కేంద్రంగా నివాసం ఉంటూ ఆటోల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లు, నగదును చాకచక్యంగా తస్కరించేవారు. ఎక్కువ రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లలో వీరు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. పైగా వీరిద్దరూ జేబు దొంగతనాలకు పాల్పడుతూ జైలు శిక్షను కూడా అనుభవించారు.
ఇలా దొరికారు
ఇటీవల టుటౌన్ పోలీసు స్టేషన్‌లో ఐదుగురు వ్యక్తులు తమ సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ రమణమూర్తి, సీఐ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో పాత నేరస్తుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. వీరు దొంగిలించిన ఫోన్లను కొన్నాళ్లు వాడిన తరువాత అమ్ముకుంటారు. అయితే రోజుకోక ఫోన్ వాడుతుండడంతో ప్రవర్తనపై అనుమానం వచ్చి బంగారుపేట జంక‌్షన్ సమీపంలో ఆటోలో వెళ్తుండగా పోలీసులు పట్టుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. వారి వద్ద నుంచి 38 సెల్‌ఫోన్లతోపాటు రూ.15 వేల నగదు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2.30 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులను హార్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కాగా, సెల్‌ఫోన్ దొంగలపై నిçఘా ఉంచి నిందితులను పట్టుకున్న టూటౌన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, సీహెచ్ ఖాజావలి, పి.మోహన్‌కిషోర్‌రెడ్డి, కానిస్టేబుల్ సీహెచ్ అమర్‌నాథ్‌రెడ్డి, కృష్ణ, అయూబ్‌ఖాన్‌లను ఎస్పీ అభినందించి రివార్డుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లను ఎలా కొట్టేస్తారో నిందితులతోనే చేసి చూపించారు.
దొంగ ఫోన్లను కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తాం...
దొంగల నుంచి సెల్‌ఫోన్ల వ్యాపారులు కొందరు పాత ఫోన్లను తక్కువగా వస్తున్నాయని కొనుగోలు చేస్తున్నారని, అలా కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఎక్కడైన సరే ఎవరిపైనైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సెల్‌ఫోన్లను పొగొట్టుకుంటే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.
Advertisement
Advertisement