విద్యుత్ ఆదా కోసం కేంద్ర పథకం
ఎల్‌ఈడీ బల్బుల తరహాలో మరో ప్రయత్నం
దేశంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా నరసాపురం ఎంపిక
సంక్రాంత్రికి పంపిణీ చేయడానికి సన్నాహాలు
ఒక్కోదాని ఖరీదు రూ.1200.. వాయిదాల్లో చెల్లించవచ్చు
నరసాపురం : దేశంలో విద్యుత్ వినియోగం, ఉత్పత్తిని మించి పెరిగిపోతోంది. దీంతో దీంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయేతర (సౌర, పవన) విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తూనే, వినియోగంలో పొదుపును పాటించే విధంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే గతంలో దేశంలో కొన్ని రాష్ట్రాలతో పాటుగా మనరాష్ట్రంలో కూడా తక్కువ విద్యుత్ వినియోగం అయ్యే ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేసింది. ఇప్పుడు అదే తరహాలో తక్కువ విద్యుత్ అవసరం అయ్యే ఫ్యాన్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్‌ఈడీ బల్బుల పంపిణీని జిల్లాలో నరసాపురం పట్టణం నుంచే ఆరంభించారు.
ఇప్పుడు ఫ్యాన్ల పంపిణీని కూడా నరసాపురం నుంచే ప్రారంభించనున్నారు. దేశంలోనే పెలైట్ ప్రాజెక్ట్‌గా నరసాపురం పట్టణాన్ని ఎంపిక చేయడం మరో విశేషం. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. సంక్రాంతి నుంచి ఫ్యాన్ల పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించి, ప్రయత్నాలు చేస్తున్నామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (విశాఖపట్నం) కమర్షియల్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.రమేష్ వివరించారు.
ప్రాజెక్ట్ ద్వారా ఫ్యాన్ల పంపిణీ ఇలా..
గతంలో ఎల్‌ఈడీ బల్బులను ప్రతి సర్వీస్ దారుడుకి రూ.20కి రెండు చొప్పున అందించారు. అయితే ఈసారి ప్రతి సర్వీస్‌కు రెండు ఫ్యాన్లు ఇస్తారు. ఒక్కో ఫ్యాన్ రూ.1200 ఖరీదు ఉంటుంది. ఈ సొమ్మును 10 నుంచి 20 వాయిదాల్లో సర్వీస్ దారులు తిరిగి చెల్లించాలి. చెల్లించాల్సిన వాయిదా సొమ్ము ప్రతినెలా విద్యుత్ బిల్లుతో కలిపి పంపుతారు. ఇందులో బలవంతం ఏమీ ఉండదు. ఇష్టం ఉన్న సర్వీస్ దారుడు మాత్రమే ఫ్యాన్లు తీసుకోవచ్చు.
సాధారణంగా మామూలుగా మనం గృహాల్లో వినియోగించే ఫ్యాన్లు 70-80 వాట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తాము పంపిణీ చేసే ఫ్యాన్లు కేవలం 35 వాట్స్ సామర్జ్యం మాత్రమే ఉంటాయని, దీంతో మూడవ వంతు కరెంట్ ఆదా అవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడు సంవత్సరాల పాటు ఫ్యాన్లకు గ్యారంటీ ఇస్తారు. ఏపీ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్‌గా పట్టణానికి చెందిన జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ కొనసాగుతున్నారు. దీంతో నరసాపురాన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడం సులువయింది. విజయవంతమైతే, రాష్ట్రంలో ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను మన జిల్లాలోనే అమలు చేసే అవకాశం ఉంది.
ఎంతవరకూ సక్సెస్ అవుతుందో..
ఫ్యాన్ల పంపిణీకి సంబంధించి ఢిల్లీలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ టెండర్లు పిలిచిందని సీజీఎం రమేష్ వివరించారు. ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా గృహాలకు ఉచితంగా ఇచ్చిన ఎల్‌ఈడీ బల్బులు బాగానే పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇళ్లలో చాలామంది అద్దెలకు ఉంటున్నారు.
గతంలో ఎల్‌ఈడీ బల్బులను, ఇంటి యజమానులు అద్దెదారులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్యాన్ల విషయంలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అద్దెదారులే విద్యుత్ వినియోగం అధికంగా చేస్తున్నారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరడంలేదు. మరి ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారనేది వేచిచూడాలి.